సముద్ర గర్భం.. మరింత పటిష్టం

భారత నావికా దళానికి అదనపు బలం చేకూర్చే దిశగా కేంద్ర సర్కారు కీలక ముందడుగు వేసింది. సముద్రజలాల్లో నావికాదళ పోరాట పటిమను

Published : 20 Jul 2021 23:29 IST

దిల్లీ: భారత నావికా దళానికి అదనపు బలం చేకూర్చే దిశగా కేంద్ర సర్కారు కీలక ముందడుగు వేసింది. సముద్రజలాల్లో నావికాదళ పోరాట పటిమను మరింత పెంచేందుకుగాను రూ.43 వేల కోట్ల వ్యయంతో కొత్తగా ఆరు జలాంతర్గాముల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ప్రాజెక్టు -75 ఇండియా కింద వీటి నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూ స్వదేశీ సంస్థలైన ఇండియన్ మజాగావ్‌ డాక్‌ యార్డ్స్‌ లిమిటెడ్, లార్సెన్ అండ్‌ టర్బోలకు టెండర్లు జారీ చేసింది.  ఈ మేరకు రక్షణ శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ రెండు భారతీయ కంపెనీలు ఇప్పుడు ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, దక్షిణ కొరియా, స్పెయిన్ సంస్థలు సహా ఐదు గ్లోబల్ ఒరిజినల్ పరికరాల తయారీదారుల నుంచి ఒక్కో భాగస్వామిని ఎన్నుకుంటాయని రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. భారత నావికాదళంలో జలాంతర్గాముల సంఖ్యను పెంచడంలో భాగంగా వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో ‘ప్రాజెక్టు -75 ఇండియా’ రెండోది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఈ ఏడాది జూన్‌లోనే ఆమోదం తెలిపింది. ఈ జలాంతర్గాముల నిర్మాణం పూర్తయితే.. చైనా నావికాదళానికి గట్టి పోటీ ఇచ్చేంతగా మన నావికాదళ సామర్థ్యం పెరుగుతుంది.  మేకిన్‌ ఇండియాలో భాగంగా చేపట్టిన అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటని రక్షణ శాఖ పేర్కొంది. భారత్‌లో జలాంతర్గామి నిర్మాణం కోసం ఒక పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు ఇది దోహద పడుతుందని అభిప్రాయపడింది. దీంతో రక్షణపరమైన దిగుమతులకు ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గుతుందని తెలిపింది.  క్రమంగా  దేశీయ వనరుల ద్వారా ఎక్కువ స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేసేందుకూ తాజా ప్రాజెక్టు తోడ్పడుతుందని పేర్కొంది. 

 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు