Modi: భద్రతా వైఫల్యం.. ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయిన ప్రధాని మోదీ..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంజాబ్‌లో నిరసన సెగ తగిలింది. ఆందోళనకారులు రహదారిని నిర్బంధించడంతో ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయారు.

Updated : 05 Jan 2022 16:29 IST

ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్‌

చండీగఢ్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పంజాబ్‌లో నిరసన సెగ తగిలింది. ఆందోళనకారులు రహదారిని నిర్బంధించడంతో ప్రధాని మోదీ 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయారు. ఫలితంగా మోదీ తన పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని మండిపడింది. అసలేం జరిగిందంటే..

హుస్సేనీవాలాలోని జాతీయ అమరవీరుల స్మారకాన్ని సందర్శించేందుకు ప్రధాని మోదీ నేడు భఠిండా చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా అమరవీరుల స్మారకం వద్దకు వెళ్లాల్సి ఉండగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అధికారులు నిర్ణయించారు. దీనిపై పంజాబ్‌ డీజీపీకి సమాచారమిచ్చారు. మోదీ ప్రయాణించే మార్గంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన పోలీసుల ధ్రువీకరణ తర్వాతే ప్రధాని కాన్వాయ్‌లో బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో మోదీ కాన్వాయ్‌ ఓ ఫ్లైఓవర్‌ వద్దకు చేరుకునే సరికి అప్పటికే కొందరు ఆందోళనకారులు రోడ్డును నిర్బంధించారు. దీంతో ఫ్లైఓవర్‌పై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మోదీ కాన్వాయ్‌ కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ప్రధాని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ వాహనాల నుంచి దిగి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దాదాపు 20 నిమిషాల పాటు మోదీ కాన్వాయ్‌ ఫ్లైఓవర్‌పైనే ఇరుక్కుపోయింది. ఆ తర్వాత ప్రధాని కాన్వాయ్‌ వెనుదిరిగి భఠిండా ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయింది. సాధారణంగా మోదీ కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో కఠినమైన భద్రతా ప్రొటోకాల్స్‌ను పాటిస్తారు. సాధారణ వాహనాలను అనుమతించరు. అలాంటిది ప్రధాని ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. 

ఘటన నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వంపై హోంశాఖ సీరియస్‌ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యం కారణంగానే మోదీ పర్యటనకు ఇబ్బందులు తలెత్తాయని దుయ్యబట్టింది. ప్రధాని పర్యటన గురించి ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆరోపించింది. రహదారి వెంట అదనపు బలగాలను మోహరించలేదని తెలిపింది. దీనిపై పంజాబ్‌ ప్రభుత్వం బాధ్యత వహించి, పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు హోంశాఖ వెల్లడించింది.

మోదీ ఫిరోజ్‌పూర్‌ పర్యటన వాయిదా..

భఠిండా కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ నేడు ఫిరోజ్‌పూర్‌లోనూ పర్యటించాల్సి ఉంది. రూ. 42,750కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రధాని నేడు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే తాజా ఘటనతో ఈ పర్యటన వాయిదా పడింది. ‘‘ప్రధాని మోదీ నేడు ఫిరోజ్‌పూర్‌కు వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని రద్దు చేయవద్దని, మరో రోజుకు వాయిదా వేయాలని ప్రధాని చెప్పారు’’ అని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఓ ర్యాలీలో వెల్లడించారు. 

పంజాబ్‌ ప్రభుత్వంపై మండిపడిన జేపీ నడ్డా

రాబోయే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదనే భయంతోనే పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రధాని పర్యటనను అడ్డుకునేందుకు ట్రిక్కులు చేస్తోందని భాజాపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. భగత్‌ సింగ్‌, పలువురు అమరవీరులకు ప్రధాని మోదీ నివాళులర్పించాలని, కొన్ని కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం కాంగ్రెస్‌కు నచ్చడంలేదన్నారు. ఇలాంటి చౌకబారు చేష్టలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పంజాబ్‌ అభివృద్ధి వ్యతిరేకులుగా, స్వాతంత్ర్య సమరయోధుల పట్ల కనీస గౌరవం లేనిదిగా నిరూపించుకుంటోందని దుయ్యబట్టారు.

ప్రధాని పర్యటనకు భద్రతాపరమైన లోపం కలగడం అత్యంత ఆందోళనకరమైన విషయమన్నారు. ప్రధాని వెళ్లే రూట్‌ క్లియరెన్స్‌పై పంజాబ్‌ సీఎస్‌, డీజీపీ.. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌నకు భరోసా ఇచ్చారనీ.. అలాగే, నిరసనకారులను కూడా అనుమతించారన్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన సీఎం చన్నీ.. కనీసం ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను విశ్వసించే ఎవరికైనా కాంగ్రెస్‌ అనుసరిస్తున్న ఇలాంటి ఎత్తుగడలు విచారం కలిగిస్తాయన్నారు. ర్యాలీకి ప్రజలు రాకుండా అడ్డుకోవాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు ఉన్నప్పటికీ నిరసనకారులు రావడంతో పెద్ద భారీ సంఖ్యలో బస్సులు రోడ్డుపైనే నిలిచిపోయాయని పేర్కొన్నారు. పంజాబ్‌ అభివృద్ధి కోసం రూ.వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు వస్తోన్న ప్రధాని మోదీ పర్యటనకు విఘాతం కలగడం బాధాకరమన్నారు. ఇలాంటి చౌకబారు చర్యలతో పంజాబ్‌ పురోగమనాన్ని అడ్డుకోనీయబోమని, రాష్ట్ర అభ్యున్నతికి తమ వంతు కృషిని కొనసాగిస్తామని నడ్డా ట్విటర్‌లో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని