North Korea: ‘ఇది ద్వేషపూరిత అపవాదు.. ఐరాస నివేదికను మేం గుర్తించడం లేదు’

ఉత్తర కొరియాలో మానవ హక్కులు, స్థానిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇటీవల ఐరాస మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి టోమస్ ఓజియా క్వింటానా వెలువరించిన నివేదికను ఉ.కొరియా తప్పుపట్టింది. దీన్ని ‘ద్వేషపూరిత అపవాదు’గా అభివర్ణించింది. సంబంధిత ప్రతినిధి...

Published : 27 Oct 2021 01:20 IST

ప్యాంగాంగ్‌: తమ దేశంలో మానవ హక్కులు, స్థానిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఇటీవల ఐరాస మానవ హక్కుల ప్రత్యేక ప్రతినిధి టోమస్ ఓజియా క్వింటానా వెలువరించిన నివేదికను ఉత్తరకొరియా తప్పుపట్టింది. దీన్ని ‘ద్వేషపూరిత అపవాదు’గా అభివర్ణించింది. సంబంధిత ప్రతినిధి దేశ వాస్తవ పరిస్థితులను వక్రీకరించడంతోపాటు పౌరుల జీవన విధానంలో జోక్యం చేసుకున్నారని ఉత్తరకొరియా ప్రతినిధి ఆరోపించారు. మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకున్న స్వీయ రక్షణ చర్యలను దుర్మార్గంగా పేర్కొన్నారని విమర్శించారు. ఉత్తర కొరియా అధికారిక వార్తా ఏజెన్సీ కేసీఎన్‌ఏ (కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ) ద్వారా ఈ విషయాలు వెల్లడించారు. సదరు నివేదికను తాము గుర్తించడం లేదని.. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా మద్దతు ఉన్న కార్యక్రమాల్లో ఇదో భాగమని ఆరోపించారు.

ఆకలి చావులు నమోదయ్యే ప్రమాదమంటూ..

మహమ్మారి కట్టడి చర్యల కారణంగా ఉత్తరకొరియా మరింత ఒంటరిగా మారిన నేపథ్యంలో బయటినుంచి ఎలాంటి సాయం అందక, ఆకలి చావులు నమోదయ్యే ప్రమాదం ఉందని క్వింటానా తన నివేదికలో పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా స్థానికంగా పరిస్థితులు మరింత దిగజారాయని తెలిపారు. ఈ క్రమంలో దేశ అణ్వాయుధ కార్యకలాపాలపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను సడలించాలని, ఈ దేశానికి మరింత సహాయాన్ని అందించాలని అందులో సూచించారు. దీన్ని ఉత్తరకొరియా ఖండిస్తూ.. ‘స్థానికుల భద్రత, జీవనోపాధికి పూర్తి బాధ్యత వహిస్తాం. మా గురించి ఆందోళన చెందాలని ఎవరినీ అడగలేదు’ అని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడిందని జూన్‌లో దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు వైరస్‌ కట్టడి కోసం దేశంలో సరిహద్దుల మూసివేత, దేశీయ ప్రయాణంపై ఆంక్షలు తదితర కఠిన చర్యలు తీసుకొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని