Kharge: ఎమర్జెన్సీ ప్రకటించకుండానే కొనసాగింపు: ఖర్గే

ఎమర్జెన్సీపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖర్గే స్పందించారు.

Updated : 24 Jun 2024 14:50 IST

దిల్లీ: ఎమర్జెన్సీపై పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖర్గే (Mallikarjun Kharge) స్పందించారు. ఖర్గే మీడియాతో మాట్లాడుతూ 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ గురించి ప్రధాని నిరంతరం ప్రస్తావిస్తూనే ఉంటారన్నారు. ఇందిరాగాంధీ(Indira gandhi) హయాంలో ఎమర్జెన్సీ(emergency) విధిస్తున్నామని ప్రకటించిన అనంతరం ప్రభుత్వం దానిని అమలుచేసిందన్నారు. కాని భాజపా పాలనలో ప్రధాని మోదీ ఎమర్జెన్సీని ప్రకటించకుండానే దానిని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఆయన ఎంతకాలం అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తారు? అని ఖర్గే ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తోందని, అందుకే భాజపాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఏకమయ్యాయని పేర్కొన్నారు.

లోక్‌సభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ  మాట్లాడుతూ ‘‘అత్యవసర పరిస్థితి ఏర్పడి రేపటికి 50 ఏళ్లు పూర్తవుతాయి. దేశ ప్రజాస్వామ్య చర్రితలో ఎమర్జెన్సీ ఓ మచ్చలా మిగిలిపోయింది. 50ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదు’’ అని అన్నారు. విపక్ష ఎంపీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘‘ఈ దేశానికి మంచి, బాధ్యతాయుతమైన విపక్షం అవసరం. ప్రజాస్వామ్య మర్యాదను కాపాడేలా, సామాన్యుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతిపక్షాలు నడుచుకుంటాయని ఆశిస్తున్నా. డ్రామాలు, ఆటంకాలను ప్రజలు కోరుకోవట్లేదు. నినాదాలు ఆశించట్లేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలి’’ అని ప్రధాని హితవు పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని