Rahul Gandhi: బంగ్లా ఖాళీ చేస్తే.. రాహుల్ ఎక్కడికి వెళ్తారు..? రిప్లయ్ ఇచ్చిన ఖర్గే

ఎంపీగా అనర్హులు కావడంతో కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ తానుంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిపై మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పందించారు. 

Published : 28 Mar 2023 16:05 IST

దిల్లీ: అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు అందాయి. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం నోటీసులు ఇచ్చింది. ఇక ఇప్పటికే తనకు సొంత ఇల్లు కూడా లేదని రాహుల్(Rahul Gandhi) చెప్పారు. ఈ సమయంలో ఆయన ఎక్కడికి వెళ్తారనేది ఆసక్తిగా మారింది. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)బదులిచ్చారు. 

‘రాహుల్‌ను బలహీనపర్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన బంగ్లాను ఖాళీ చేస్తే.. తన తల్లి దగ్గరకు వెళ్లి ఉంటారు. లేకపోతే నా దగ్గరకు వస్తారు. ఆయన కోసం నా ఇంటిలో చోటు ఉంటుంది. కానీ ఆయన్ను బెదిరించడం, అవమానించడం వంటి  ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. గతంలో మూడునాలుగు నెలల పాటు బంగ్లా కేటాయించకుండా వేధించారు. ఆరు నెలల తర్వాత దానిని నాకు కేటాయించారు. ఇతరులను అవమానించడానికి కొందరు ఇలా ప్రవర్తిస్తారు. అలాంటి ప్రవర్తనను నేను ఖండిస్తున్నాను’ అంటూ ఖర్గే(Mallikarjun Kharge) మీడియాతో మాట్లాడారు. 

పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని (Disqualification) రద్దు చేస్తూ ఇటీవల లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో నిబంధనల ప్రకారం.. నెల రోజుల్లోపు అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే 12- తుగ్లక్‌లేన్‌లోని అధికార బంగ్లాను ఏప్రిల్‌ 22లోగా ఖాళీ చేయాలంటూ రాహుల్‌కు లోక్‌సభ హౌసింగ్‌ కమిటీ సోమవారం నోటీసులు జారీ చేసింది. వాటిపై రాహుల్ కూడా బదులిచ్చారు.  అధికారుల ఆదేశాలను తాను తప్పకుండా పాటిస్తానని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని