Mallikarjun Kharge: గాంధీల సమక్షంలో.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణం..

 తనను సామాన్య స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకువచ్చింది పార్టీనేనని కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆయన ఈ రోజు పార్టీ బాధ్యతలు స్వీకరించారు.

Updated : 26 Oct 2022 12:38 IST

దిల్లీ: శతాధిక కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టారు. ఇంతకాలం ఆ పదవిలో కొనసాగిన సోనియా గాంధీ నుంచి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన పార్టీ అంతర్గత ఎన్నికల్లో సీనియర్ నేత శశిథరూర్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. నూతన అధ్యక్షుడికి సోనియా, రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు. ‘ఖర్గేజీ ఎంతో అనుభవం కలిగిన నేత. కష్టించే తత్వంతో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్ష హోదాకు చేరుకున్నారు. ఆయన పార్టీలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తారు’అని సోనియా అన్నారు. దిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తనను సామాన్య స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకువచ్చింది పార్టీనేనన్నారు. పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్లడమే తనముందు ఉన్న లక్ష్యమని వెల్లడించారు. బాధ్యతల నిర్వహణలో ప్రతిఒక్కరి సహకారం తీసుకుంటాని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిధంగా భాజపా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. రాహుల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని