Odisha Train Accident: మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం.. మమత ప్రకటన

ఒడిశాలో రైలు దుర్ఘటనలో మృతులు, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు సిఫారసు చేయడంపైనా ఆమె స్పందించారు.

Updated : 05 Jun 2023 17:33 IST

కోల్‌కతా: ఒడిశాలోని బాలేశ్వర్‌లో మూడు రైళ్లు ఢీకొని జరిగిన  ఘోర ప్రమాదం(Odisha Train Accident)లో బాధిత కుటుంబాలను ఆదుకొనే విషయంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) కీలక నిర్ణయం తీసుకున్నారు.  తమ రాష్ట్రానికి చెందిన మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే, అవయవాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం మానసిక, శారీరక గాయాలతో బాధపడుతున్నవారికి నగదు సాయం అందిస్తామన్నారు. మంగళవారం భువనేశ్వర్‌, కటక్‌ వెళ్లి అక్కడ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించనున్నట్టు చెప్పారు.

ప్రస్తుతం బెంగాల్‌కు చెందిన ప్రయాణికుల్లో 206 మంది గాయపడ్డారని.. ఒడిశాలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారని మమత చెప్పారు. వీరిలో 33 మంది పరిస్థితి విషమంగా ఉండగా.. వారంతా కటక్‌ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్టు దీదీ తెలిపారు. కొందరు మంత్రులు, సీనియర్‌ ఉన్నతాధికారులు తనతో పాటు వస్తారని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలను బుధవారం కలిసి ఎక్స్‌గ్రేషియో చెక్కులతో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను సైతం మమత అందించనున్నారు. రైలు దుర్ఘటన అంశంలో ఎలాంటి రాజకీయాల జోలికి వెళ్లబోనన్న దీదీ.. క్షతగాత్రులు, వారి కుటుంబాలకు సాయం గురించే ఆలోచిస్తున్నట్టు చెప్పారు. 

సీబీఐ విచారణకు సిఫారసు చేయడంపై..

మరోవైపు, రైలు దుర్ఘటనపై కుట్రకోణం ఉందన్న అనుమానాల నేపథ్యంలో రైల్వేబోర్డు సీబీఐ విచారణకు సిఫారసు చేయడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు దీదీ స్పందించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని తాము కోరుకుంటున్నామన్న దీదీ.. నిజాన్ని అణిచివేసేందుకు ఇది సమయం కాదన్నారు. గతంలో జరిగిన రైలు దుర్ఘటనలపై సీబీఐ విచారణ సందర్భాలను గుర్తు చేసిన ఆమె.. ఏళ్లు గడిచినా ఎలాంటి ఫలితం రాలేదని తెలిపారు.  రైల్వే సేఫ్టీ కమిషన్‌ ఉందని.. సత్వరమే అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని