West Bengal : గవర్నర్ ట్విటర్‌ ఖాతాను బ్లాక్‌ చేసిన మమతా బెనర్జీ

పశ్చిమ్ బెంగాల్‌ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్‌, ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మధ్య మెరుగైన సంబంధాలు లేవని అనేక మార్లు వెల్లడవుతూనే ఉంది.

Published : 01 Feb 2022 01:30 IST

ఆయన ట్వీట్లతో ప్రతిరోజూ చిరాకు పడుతున్న టీఎంసీ అధినేత్రి

కోల్‌కతా: పశ్చిమ్ బెంగాల్‌ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్‌, ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మధ్య మెరుగైన సంబంధాలు లేవని అనేక మార్లు వెల్లడవుతూనే ఉంది. తాజా పరిణామంతో అవి కాస్తా బీటలు వారినట్లు తెలుస్తోంది. తాను గవర్నర్ ట్విటర్ ఖాతాను బ్లాక్‌ చేసినట్లు మమత వెల్లడించడమే అందుకు కారణం. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. 

‘దీనిపై ముందుగా నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఆయన (గవర్నర్) ప్రతిరోజు నన్నూ, నా అధికారులను దర్భాషలాడుతూ ఏదో ఒకట్వీట్ చేస్తుంటారు.  అందుకే ఆయన ఖాతాను నేను బ్లాక్‌ చేశాను. ఆ ట్వీట్ల వల్ల నేను ప్రతి రోజూ చిరాకు పడుతున్నాను’ అంటూ గవర్నర్‌ ఖాతాను బ్లాక్‌ చేయడం గురించి వెల్లడించారు. 

‘ఆయన గురించి ప్రధాని నరేంద్రమోదీకి అనేకసార్లు లేఖల ద్వారా వెల్లడించాను. ఆయన అసలు మా మాట వినిపించుకోవడం లేదని, బెదిరిస్తున్నారని వివరించాను. నేను గవర్నర్‌ దగ్గరకు వెళ్లి మాట్లాడాను కూడా. గత ఏడాది కాలంగా ఓపిక పడుతున్నాం. ఆయన చాలా ఫైళ్లను క్లియర్ చేయకుండా పెండింగ్‌లో ఉంచుతున్నారు. ఆయన మా ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాల గురించి మాట్లాడుతున్నారు. ప్రధాని ఆయన్ను ఎందుకు తొలగించడం లేదు? పెగాసస్‌ గవర్నర్ ఇంటి నుంచే నడుస్తోంది. ఆయన మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు’ అంటూ మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

నిన్న మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ మమత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘పవిత్రమైన బెంగాల్‌ హింసాత్మకంగా మారడాన్ని నేను చూడలేను. మానవ హక్కులను తుంగలో తొక్కే ప్రయోగశాలగా దానిని మారనివ్వను. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గ్యాస్‌ చాంబర్‌గా మారిందని ప్రజలు అంటున్నారు. ఇక్కడ చట్టబద్ధమైన పాలన లేదు. రాజ్యాంగాన్ని రక్షించడం నా బాధ్యత’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించారు. ఈ క్రమంలో మమత ఆయన ఖాతాను బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలు ఒకరిపై ఆరోపించుకోవడం ఇదేం తొలిసారి కాదు. గవర్నర్ కేంద్రానికి ఏజెంట్ అని అధికార పార్టీ నేతలు ఎన్నో సార్లు ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు