Mamata Banerjee: భాజపా తీరును ఖండించేందుకు ఎలా ముందుకెళ్దాం..?

ప్రత్యర్థులను అణచివేసేందుకు భాజపా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళనకరమంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష నేతలకు లేఖ రాశారు.

Published : 29 Mar 2022 19:30 IST

ప్రతిపక్ష పార్టీలకు మమత లేఖ.. సమావేశమవుదామంటూ నేతలకు పిలుపు

కోల్‌కతా: ప్రత్యర్థులను అణచివేసేందుకు భాజపా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం తీవ్ర ఆందోళనకరమంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష నేతలకు లేఖ రాశారు. ఈ వైఖరిని ప్రతిఘటిస్తూ..ముందుకు వెళ్లాల్సిన మార్గాలపై చర్చించేందుకు సమావేశం కావాలని పిలుపునిచ్చారు. ఆమె ఆదివారం ఈ లేఖ రాసినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. 

‘రాజకీయ ప్రత్యర్థుల్ని అణచివేసేందుకు, వేధింపులకు గురిచేసేందుకు అధికార భాజపా కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ సంస్థలు చర్యలకు దిగుతాయి. భాజపా వ్యవహరిస్తోన్న తీరును ప్రతిఘటిస్తూ.. ముందుకు వెళ్లాల్సిన మార్గాలపై చర్చించేందుకు అంతా సమావేశం కావాలని కోరుతున్నాను. దేశంలోని ప్రగతిశీల శక్తులు ఏకతాటిపై వచ్చి ఈ అణచివేత శక్తికి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంది. ఈ దేశానికి తగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమైక్య ప్రతిపక్షం ఉండాలి.

నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. కానీ ప్రస్తుత పక్షపాత రాజకీయాల వల్ల ప్రజలకు న్యాయం జరగడం లేదు. మన ప్రజాస్వామ్యానికి న్యాయవ్యవస్థ, మీడియా, ప్రజలు మూల స్తంభాలు. అందులో దేనికైనా అంతరాయం కలిగితే.. మొత్తం వ్యవస్థ కూలిపోతుంది. ఈ కేంద్రం చేస్తోన్న చర్యలకు దానిని జవాబుదారీ చేయడం ప్రతిపక్షాలుగా మన బాధ్యత’ అంటూ ఆ లేఖలో ప్రతిపక్ష నేతలను కోరారు. 

గత ఏడాది జరిగిన పశ్చిమ్ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు ఎదురొడ్డి నిలిచి, మమత ఘన విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి జాతీయ రాజకీయాలపై ప్రధానంగా దృష్టి సారించారు. 2024 ఎన్నికల్లో కమలం పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, బొగ్గు కుంభకోణం కేసులో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఈడీ మరోమారు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ లేఖ వెలువడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని