Mamata Banerjee: ‘కాళీ’ వివాదం.. మమత కీలక వ్యాఖ్యలు..!

సొంత పార్టీ నేత మహువా మొయిత్ర చేసిన మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ప్రజలు తప్పులు చేస్తారని, వాటిని సరిదిద్దుకోవచ్చని వ్యాఖ్యానించారు.

Published : 07 Jul 2022 18:56 IST

కోల్‌కతా: సొంత పార్టీ నేత మహువా మొయిత్ర చేసిన మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ప్రజలు తప్పులు చేస్తారని, వాటిని సరిదిద్దుకోవచ్చని వ్యాఖ్యానించారు. ‘పని చేసేప్పుడు మనం తప్పులు చేస్తుంటాం. వాటిని సరిదిద్దుకోవచ్చు. కొందరు చేసిన మంచి పనిని చూడరు. అకస్మాత్తుగా కేకలు వేయడం మొదలుపెడతారు. నెగిటివిటీ మన ఆలోచనలను దెబ్బతీస్తుంది. అందుకే సానుకూలంగా ఆలోచించండి’ అంటూ కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. 

అసలు వివాదం ఎక్కడ వచ్చిందంటే..?

దర్శకురాలు, రచయిత్రి, నటి లీనా మణిమేగలై తన తాజాచిత్రం ‘కాళీ’కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మంగళవారం ఓ చర్చా కార్యక్రమంలో దీనిపై మొయిత్ర చేసిన వ్యాఖ్యలు తాజా వివాదానికి దారితీశాయి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన మొయిత్రను అరెస్ట్‌ చేయాలని పశ్చిమ బెంగాల్‌ భాజపా అధ్యక్షుడు సుకాంత మజుందార్‌, ఆ పార్టీకి చెందిన విపక్ష నేత సువేందు అధికారి డిమాండ్‌ చేశారు. పది రోజుల్లో చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని తృణమూల్‌కు సూచించారు. ఈ క్రమంలోనే భాజపా కార్యకర్తలు పెద్దసంఖ్యలో బౌబజార్‌ ఠాణా వద్దకు చేరుకుని, మొయిత్రకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తాజా పరిణామాల క్రమంలో, మహువా మొయిత్ర ఘాటుగా స్పందించారు. ‘నేను కాళీమాత భక్తురాలిని. గూండాలకు, వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. దమ్ముంటే నాపై చర్యలు తీసుకోవాలని భాజపాకు సవాలు విసురుతున్నా. నా వెనుక సత్యం ఉంది. సత్యానికి బ్యాకప్‌ శక్తులు అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు. తాను ఏ చిత్రానికీ, ఏ పోస్టర్‌కూ మద్దతు ఇవ్వలేదని, ధూమపానం అనే పదాన్ని అసలు వాడనేలేదని వివరణ ఇచ్చారు. కాగా, తృణమూల్‌ ఎంపీపై భోపాల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని