Mamata Banerjee: మోదీజీ.. ఆ విషయంలో రాజీపడలేం: మమత

భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య జల ఒప్పందాల కోసం ఇటీవల జరిగిన చర్చపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు.

Published : 25 Jun 2024 00:06 IST

కోల్‌కతా: భారత్‌- బంగ్లాదేశ్‌ (India-Bangladesh) మధ్య నదీజలాల ఒప్పందాల కోసం ఇటీవల జరిగిన చర్చపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రఅభిప్రాయం తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీకి (PM Modi) ఆమె లేఖ రాశారు. బంగ్లాదేశ్‌కు పొరుగున ఉన్న పశ్చిమబెంగాల్‌ను ఈ చర్చలో భాగస్వామ్యం చేయకపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. మూడు రోజుల క్రితం భారత పర్యటనకు వచ్చిన బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాతో ప్రధాని మోదీ భేటీ అయిన సంగతి తెలిసిందే. మొత్తం 10 ఒప్పందాలు ఖరారయ్యాయి. అందులో గంగా, తీస్తా జలాల అంశాలు కూడా ఉన్నాయి.

‘‘ భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య 2026లో ముగిసిపోనున్న గంగా నదీ జలాల పంపక ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు భారత్‌ అడుగులు వేస్తున్నట్లు  అర్థమైంది. ఇది భారత్, బంగ్లాదేశ్‌ మధ్య కుదిరిన జల ఒప్పందం. అది మీకు, నాకు, ఇరుదేశాల ప్రజలకు తెలుసు. ఇలాంటి ఒప్పందాల వల్ల బెంగాల్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇండో- బంగ్లా రైల్వేలైను, బస్‌ సర్వీస్‌ లాంటి పలు ఒప్పందాలకు పశ్చిమ బెంగాల్‌ సహకరించింది. కానీ, ప్రజలకు, వారి మనుగడకు నీరు ఎంతో కీలకం. అలాంటి విషయాల్లో రాజీ పడలేము’’ అని మమతా బెనర్జీ తన లేఖలో పేర్కొన్నారు.

తీస్తా జలాల పంపకాల ప్రతిపాదనను ప్రస్తావిస్తూ.. సిక్కింలో అనేక జలవిద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులకు ఎగువన ఉన్న పరీవాహక ప్రాంతంలో అటవీ నిర్మూలన కారణంగా ఇప్పటికే నది మనుగడ చిక్కుల్లో పడిందని గుర్తుచేశారు. అంతేకాకుండా బంగ్లాదేశ్‌కు వెళుతున్న ఆ నదిలో ఇప్పుడు సరిపడా నదీ ప్రవాహం ఉండటం లేదన్నారు. నదిని సంరక్షించాల్సిన కేంద్ర జలశక్తి శాఖ మిన్నకుండిపోతుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం పొరుగుదేశంతో జలాల పంపిణీ కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. నార్త్‌ బెంగాల్‌ ప్రాంతంలోని ప్రజలు నీరు లేక ఇబ్బందులు పడుతుంటే.. తీస్తా నదిపై ప్రాజెక్టుకు బంగ్లాదేశ్‌కు సహకరిస్తామని ప్రకటించడం భావ్యం కాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని