TMC: ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ వివాదం.. 20మందితో కొత్త గ్రూపు ఏర్పాటు చేసిన దీదీ

‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ వివాదంపై తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ముదురుతున్న వేళ......

Published : 13 Feb 2022 01:19 IST

కోల్‌కతా: ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ వివాదంపై తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ముదురుతున్న వేళ.. పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై సమగ్ర నివేదిక అందజేసేందుకు 20మందితో కూడిన జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. తన మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తోపాటు పార్టీలోని సీనియర్‌ నేతలతో శనివారం అత్యవసరంగా భేటీ అనంతరం బెంగాల్‌ సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యవర్గాన్ని దీదీ త్వరలోనే ప్రకటిస్తారని సమావేశానికి హాజరైన పార్థ ఛటర్జీ విలేకర్లకు వెల్లడించారు.

‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల మధ్య వివాదం ఏర్పడినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. పార్టీని అంతర్గతంగా పునర్వ్యవస్థీకరించాలని భావించిన అభిషేక్‌ బెనర్జీ.. ‘ఐప్యాక్‌’ సాయంతో ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’ విధానాన్ని తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన వర్గానికి చెందిన కొందరు నేతలు పార్టీలో ఈ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ట్విటర్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. అయితే ఈ నిర్ణయాన్ని పార్టీ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కొందరు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ ప్రకటనలు కూడా చేశారు.

దీంతో ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది. తృణమూల్‌లో జూనియర్లు, సీనియర్ల మధ్య అంతర్గత పోరు మొదలైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే సమయంలో టీఎంసీ, ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐప్యాక్‌ మధ్య కూడా దూరం పెరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన దీదీ.. శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై నివేదిక అందజేసేందుకు కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని