మమత కోసం.. 30 నిమిషాలు మోదీ ఎదురుచూపు?

యస్‌ తుపాను ప్రభావంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హాజరు కాకపోవడం రాజకీయ దుమారం రేపుతోంది.

Published : 29 May 2021 01:35 IST

మమతా బెనర్జీది నియంతృత్వ స్వభావమన్న ప్రతిపక్షం

కోల్‌కతా: యస్‌ తుపాను ప్రభావంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ హాజరు కాకపోవడం రాజకీయ దుమారం రేపుతోంది. అంతేకాకుండా ఈ సమావేశానికి మమతా బెనర్జీ రాకకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బెంగాల్‌ గవర్నర్‌ 30 నిమిషాల పాటు వేచి చూశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉద్దేశపూర్వకంగానే దీదీ ఆ సమావేశానికి గైర్హాజరు అయ్యారని ఆరోపించిన భాజపా నేతలు.. మమతా బెనర్జీ నియంతృత్వ స్వభావాన్ని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు.

యస్‌ తుపాను ప్రభావాన్ని తెలుసుకునేందుకు ప్రధాని మోదీ శుక్రవారం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు పశ్చిమబెంగాల్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన అనంతరం.. కలైకుందా ఎయిర్‌బేస్‌లో ప్రధాని మోదీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ముఖ్యకార్యదర్శి రావాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం తరపున ఏ ఒక్కరూ హాజరుకాలేదు. కేవలం గవర్నర్‌, ప్రతిపక్షనేత సువేందు అధికారి మాత్రమే హాజరయ్యారు. చివరకు 30 నిమిషాల ఆలస్యంగా అక్కడకు వచ్చిన మమతా బెనర్జీ.. ఓ నివేదికను ప్రధానమంత్రికి అందించారు. ఇతర కార్యక్రమాలు ఉన్నందున వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ వెంటనే అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోయారు.

ఉద్దేశపూర్వకంగానే..?

ప్రధానమంత్రి సమావేశానికి హాజరుకాకపోవడం పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. కేవలం ఇతర కార్యక్రమాల్లో ఉన్నందు వల్లే సమావేశానికి ఆలస్యంగా వచ్చానని చెప్పారు. అయితే, మమతా బెనర్జీ స్పందన ఇలా ఉన్నప్పటికీ ప్రధాని సమీక్షా సమావేశానికి అధికారులను కూడా పంపకపోవడం చర్చనీయాంశమయ్యింది. ఉద్దేశపూర్వకంగానే అధికారులను కూడా ప్రధాని సమావేశానికి హాజరు కావద్దని సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

గవర్నర్‌ అసంతృప్తి..

ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశానికి మమతా బెనర్జీ గైర్హాజరు పట్ల రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధనకర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశానికి గైర్హాజరు కావడం రాజ్యాంగం, సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి చర్యల ద్వారా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను దెబ్బతీస్తాయన్నారు. ఇక మమతా బెనర్జీ తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రిని అగౌరవ పరిచేలా, అమర్యాదగా ఓ ముఖ్యమంత్రి ప్రవర్తించడం గతంలో ఎన్నడూ చూడలేదని పేర్కొంది.

దీదీపై విరుచుకుపడ్డ ప్రతిపక్షం..

మమతా బెనర్జీ నియంతృత్వ పోకడలకు తాజా సంఘటన ఓ నిదర్శనమని పశ్చిమబెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి విమర్శించారు. అంతేకాకుండా రాజ్యంగా విలువలను అగౌరవపరచడమేన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రితో కలిసి పనిచేయాల్సింది పోయి రాజకీయాలు చేయడం దీదీ పట్ల అసహ్యం కలిగేలా చేస్తోందని దుయ్యబట్టారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి, మమతా బెనర్జీ భేటీ కావడం ఇదే తొలిసారి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని