Mamata: జుబైర్‌, తీస్తా సీతల్వాడ్‌ చేసిన నేరమేంటి?: కేంద్రానికి దీదీ సూటిప్రశ్న

ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్‌ జుబైర్‌ (Mohammed Zubair), ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ (Teesta Setalvad) అరెస్టుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రస్థాయిలో .....

Published : 29 Jun 2022 01:58 IST

అసన్‌సోల్‌: ప్రముఖ జర్నలిస్టు, ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ సహ వ్యవస్థాపకుడు జుబైర్‌ (Mohammed Zubair), ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ (Teesta Setalvad) అరెస్టుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రజల్లో విద్వేషాలు వ్యాప్తి చేసేవారు స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే.. నిజాలను బహిర్గతం చేసేందుకు ప్రయత్నించిన వారు అరెస్టవుతున్నారంటూ ఆమె ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పశ్చిమ్‌ బర్ధమాన్‌ జిల్లాలోని అసన్‌సోల్‌లో నిర్వహించిన తమ పార్టీ సమావేశంలో కేంద్రంపై దీదీ ఫైరయ్యారు. ‘‘మొహమ్మద్‌ జుబైర్‌, తీస్తా సీతల్వాడ్‌లను ఎందుకు అరెస్టు చేశారు? వాళ్లు చేసిన నేరమేంటి? నిజం మాట్లాడటం, నిజాన్ని బహిర్గతం చేయడమే నేరమా? ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని ఏజెన్సీలతో వేధిస్తారు లేదా అరెస్టు చేస్తారు’’ అంటూ కేంద్రంపై ధ్వజమెత్తారు.

దేశంలో విద్వేషాలు, హింసను వ్యాప్తి చేసే వారిని ఈ ప్రభుత్వం అరెస్టు చేయడంలేదంటూ ఇటీవల  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా బహిష్కృత నేత నుపుర్‌ శర్మను ఉద్దేశించి దీదీ వ్యాఖ్యానించారు. మన దేశంలో ద్వేషాన్ని, హింసను వ్యాపించే వారిని అరెస్టు చేయరని.. అలాంటి వాళ్లపై కనీసం ఎలాంటి చర్యలూ ఉండవని మండిపడ్డారు. వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేవారిని కనీసం టచ్‌ చేయరని.. అలాంటి వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నవాళ్లను మాత్రం వేధింపులకు గురిచేస్తారన్నారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపైనా తీవ్ర విమర్శలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన ఈ స్కీమ్‌ పెద్ద కుంభకోణమని.. జుమ్లా రాజకీయాలకు ఇది మరో ఉదాహరణగా నిలుస్తుందని దీదీ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని