Mamata Vs Pegasus: రూ.25కోట్లకు పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ఆఫర్‌ : మమతా

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ విక్రయంపై తమకు కొన్నేళ్ల క్రితమే ఆఫర్‌ వచ్చిందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.

Published : 18 Mar 2022 01:46 IST

తిరస్కరించామన్న పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి

దిల్లీ: ప్రముఖుల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయంటూ వెలుగు చూసిన పెగాసస్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సాఫ్ట్‌వేర్‌ విక్రయంపై తమకు కొన్నేళ్ల క్రితమే ఆఫర్‌ వచ్చిందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. అయినా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే ఇటువంటి సాఫ్ట్‌వేర్‌ కొనుగోలును తమ ప్రభుత్వం వ్యతిరేకించిందన్నారు. తన ఫోన్‌ ట్యాపింగ్‌ గురవుతున్న విషయానికి సంబంధించి పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో బుధవారం మాట్లాడిన మమతా, పెగాసస్‌ విక్రయం ఆఫర్‌పై తాజాగా మరింత సమాచారాన్ని వెల్లడించారు.

‘పెగాసస్‌కు హ్యాకింగ్‌కు సంబంధించిన పరికరాల విక్రయం కోసం నాలుగైదేళ్ల క్రితం ఆ సంస్థ ప్రతినిధులు మా పోలీస్‌ డిపార్టుమెంటును సంప్రదించారు. అందుకు రూ.25కోట్లను డిమాండ్‌ చేశారు. ఆ విషయం నా దగ్గరకు వచ్చింది. అలాంటి మెషీన్లు మనకు అవసరం లేదని తిరస్కరించాను. సంఘ విద్రోహ చర్యలు, భద్రత కోసమైతే వేరే విషయం. కానీ, రాజకీయ కారణాల కోసం వినియోగించారు. అధికారులు, న్యాయమూర్తులపైనా ఉపయోగించడం ఆమోదించదగిన విషయం కాదు’ అని మమతా బెనర్జీ వెల్లడించారు.

ఇదిలాఉంటే, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ నుంచి కొనుగోలు చేసిన పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా దేశంలోని రాజకీయ నాయకులు, పాత్రికేయులు, సామాజిక కార్యకర్తల ఫోన్లపై నిఘా ఉంచిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ, ప్రశాంత్‌ కిశోర్‌, కొందరు కేంద్ర మంత్రులు, మాజీ న్యాయమూర్తులతో పాటు జర్నలిస్టుల ఫోన్లు లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ, ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా వ్యక్తుల గోప్యత హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని