
మే 5న దీదీ ప్రమాణస్వీకారం
మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం
కోల్‌కతా: ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెట్టి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఒంటిచేత్తో పార్టీకి అపూర్వ విజయాన్ని అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌లో ఓటమి చవిచూశారు. అయినప్పటికీ ఆమే మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలతో సోమవారం పార్టీ అధిష్ఠానం సమావేశమైంది. ఈ సందర్భంగా దీదీని తమ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మే 5వ తేదీ బుధవారం రోజున మమత సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి, సీనియర్ నేత పార్థ ఛటర్జీ తెలిపారు. ఇందుకోసం రాత్రి 7 గంటలకు దీదీ గవర్నర్ జగదీప్ ధన్కర్ను కలవనున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి.
పశ్చిమ బెంగాల్ బెబ్బులిగా పేరొందిన మమతా బెనర్జీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో 213 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. గతంతో పోలిస్తూ భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నప్పటికీ నందిగ్రామ్‌లో మాత్రం సువేందు అధికారి చేతుల్లో మమతా ఓటమిపాలయ్యారు. దీంతో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నప్పటికీ.. మరో 6నెలల్లోపే శాసనసభ సభ్యురాలిగా మమతా బెనర్జీ గెలవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు ఆమె ఏ స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.