అయ్యో.. షరీఫ్‌ చాచా! ఎంత దీన స్థితి

ఆయన పేరు మహ్మద్‌ షరీఫ్‌. వయసు 83 ఏళ్లు. చుట్టుపక్కల వాళ్లంతా షరీఫ్‌ చాచా అని పిలుస్తుంటారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ఫైజాబాద్‌లో నివాసం. పేద కుటుంబమే. అయితేనేం? ఆయనదో అసాధారణ సంకల్పం. 25 ఏళ్లుగా 25వేలకు పైగా అనాథ శవాలకు తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించారు....

Updated : 21 Feb 2021 04:27 IST

25వేలకు పైగా అనాథ శవాలకు అంత్యక్రియలు

వైద్యానికి డబ్బుల్లేక ఇబ్బంది

(Image:Social media)

అయోధ్య: ఆయన పేరు మహ్మద్‌ షరీఫ్‌. వయసు 83 ఏళ్లు. చుట్టుపక్కల వాళ్లంతా షరీఫ్‌ చాచా అని పిలుస్తుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఫైజాబాద్‌లో నివాసం. పేద కుటుంబమే. అయితేనేం? ఆయనదో అసాధారణ సంకల్పం. 25 ఏళ్లుగా 25వేలకు పైగా అనాథ శవాలకు తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించారు. ‘పద్మ శ్రీ’ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాంటి వ్యక్తి నేడు వృద్ధాప్యం, అనారోగ్యంతో మంచం పట్టారు. చికిత్స చేయించుకోవడానికి డబ్బులు లేక అవస్థలు పడుతున్నారు.

మొహల్లా ఖిర్కీ అలీ బేగ్‌లోని ఆయన నివాసాన్ని పీటీఐ ప్రతినిధి గురువారం సందర్శించేటప్పటికి షరీఫ్‌ చాచా మంచం మీదే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన సృహలో ఉండటం లేదు. ‘పద్మ శ్రీ’ పురస్కారానికి బదులు పింఛన్ ఇస్తే వైద్యం చేయించగలమని ఆయన కుటుంబ సభ్యులు అన్నారు.

తన తండ్రి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారని గతేడాది కేంద్ర హోంశాఖ నుంచి లేఖ అందిందని కుమారుడు షాగీర్‌ తెలిపారు. పురస్కారం ఎప్పుడు అందిస్తారో త్వరలోనే తెలియజేస్తామంటూ కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా నుంచి 2020, జనవరి 31 తేదీతో లేఖ వచ్చిందన్నారు. ఫైజాబాద్‌ భాజపా ఎంపీ లల్లూసింగ్‌  తన తండ్రి పేరును సిఫార్సు చేశారని వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఆయనకు ఆ పురస్కారం అందకపోవడం గమనార్హం.

పురస్కారం పరిస్థితి గురించి ఆరా తీయగా ‘ఇంకా అవార్డు అందుకోలేదా? ఏం జరిగిందో నేను చూస్తాను’ అని ఆయన పీటీఐకి తెలిపారు. ప్రస్తుతం తాను ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్నానని నెలకు రూ.7వేలు మాత్రమే వస్తుందని షాగీర్‌ అన్నారు.  అందులోనే ప్రతి నెల రూ.4వేలు తండ్రి వైద్యం కోసం ఖర్చు చేయాల్సి రావడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు లేకపోవడంతో సరైన వైద్యమూ ఇప్పించలేకపోతున్నామని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని