Vaccine: కరోనా టీకా వల్లే నా కుమార్తె మృతి.. ₹1000 కోట్లు చెల్లించాలి

కరోనా టీకా దుష్ప్రభావాల కారణంగానే తన కుమార్తె చనిపోయిందని పేర్కొంటూ మహారాష్ట్ర ఔరంగాబాద్​కు చెందిన ఓ వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. భారీ పరిహారాన్ని కోరాడు......

Published : 03 Feb 2022 02:39 IST

ముంబయి: కరోనా టీకా దుష్ప్రభావాల కారణంగానే తన కుమార్తె చనిపోయిందని పేర్కొంటూ మహారాష్ట్ర ఔరంగాబాద్​కు చెందిన ఓ వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. భారీ పరిహారాన్ని కోరాడు. మహారాష్ట్ర ప్రభుత్వం, సీరం సంస్థలను రూ.1000కోట్లు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని ఆ పిటిషన్​లో కోరాడు. వైద్య విద్యార్థిని అయిన తన కూతురు గతేడాది జనవరిలో వ్యాక్సిన్ తీసుకుందని, ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్​ కారణంగా ప్రాణాలు కోల్పోయిందని వివరించాడు.

‘నా కుమార్తె స్నేహాల్.. నాసిక్​లో వైద్య విద్యార్థిని. వ్యాక్సినేషన్​ డ్రైవ్​లో భాగంగా.. ఆరోగ్య కార్యకర్తలంతా టీకా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ఆమె గతేడాది కొవిషీల్డ్ టీకా డోసు తీసుకుంది. కరోనా టీకా సురక్షితమని, ఎలాంటి హానీ ఉండదని చెప్పారు. అది నమ్మి వైద్య కళాశాలలో నా కూతురు వ్యాక్సిన్​ తీసుకుంది. ఆమె ఆరోగ్య కార్యకర్తగా కూడా సేవలందించింది. టీకా సురక్షితమని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ), ఎయిమ్స్ డైరెక్టర్‌​, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తప్పుడు ప్రచారం చేయడం వల్లే నా కూతురు లాంటి ఆరోగ్య కార్యకర్తలు ఎంతో మంది వ్యాక్సిన్​ తీసుకున్నారు’ అని పేర్కొన్నారు.

తన కూతురు 2021 జనవరి 28న టీకా తీసుకుందని, ఆ తర్వాత దుష్ప్రభావాల కారణంగా మార్చి 1న మరణించిందని లునావత్ పిటిషన్‌లో పేర్కొన్నాడు.  కొవిషీల్డ్ టీకా దుష్ప్రభావాల కారణంగానే నా కుమార్తె మృతి చెందిందని.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన AEFI కమిటీ గతేడాది అక్టోబర్​ 2న వెల్లడించినట్లు తెలిపారు. తన కుమార్తెకు న్యాయం కావాలని, అలాగే ఆమె లాంటి ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకే ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు యువతి తండ్రి తన  పిటిషన్‌లో వివరించారు. దీన్ని గతవారమే దాఖలు చేయగా.. హైకోర్టు విచారణకు ఇంకా తేదీని ఖరారు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని