Corona: వ్యాక్సిన్‌ లేకుండా ఖాళీ సూది గుచ్చేశారు!

బిహార్‌లోని చాప్రా జిల్లాలో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వెళ్లిన ఓ యువకుడికి  అక్కడి నర్సు వ్యాక్సిన్‌ వేయకుండా ఖాళీ సూదితో గుచ్చేసింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన  వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో

Updated : 26 Jun 2021 09:36 IST

పట్నా: దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేయాలనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలను వేగవంతం చేశాయి. అయితే  కొంతమంది వైద్య సిబ్బంది  నిర్లక్ష్యం కారణంగా కొన్నిచోట్ల ఒకే వ్యక్తికి ఒకే రోజు రెండు డోసులు ఇవ్వడం, ఒకే రోజు వేర్వేరు టీకాలు వేసిన ఘటనలు కూడా జరిగాయి. వ్యాక్సినేషన్‌ కేంద్రంలో రెండు రకాల టీకాలను ఒకేసారి పంపిణీ చేయడం కూడా దీనికి కారణమవుతోంది. కొందరు తెలియక ఒక టీకా వేసుకొన్న కొద్దిసేపటికే ఆ పక్కనే ఉన్న మరోలైన్‌లో నిలబడి రెండో టీకా వేయించుకుంటున్నారు. కొన్ని చోట్ల నర్సుల నిర్లక్ష్యం కూడా దీనికి కారణమవుతోంది.

బిహార్‌లోని చాప్రా జిల్లాలో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వెళ్లిన ఓ యువకుడికి  అక్కడి నర్సు వ్యాక్సిన్‌ వేయకుండా ఖాళీ సూదితో గుచ్చేసింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన  వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో అధికారులు ఆ నర్సును విధుల నుంచి తొలగించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. చాప్రాలోని ఓ వ్యాక్సినేషన్‌ కేంద్రానికి ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి వెళ్లాడు. బాధితుడు వ్యాక్సిన్‌ వేయించుకుంటుంటే అతడి ముఖ కవళికలను రికార్డు చేసేందుకు స్నేహితుడు వీడియో తీశాడు.  ఆ తర్వాత ఇద్దరూ బయటికొచ్చేశారు. తీరా ఆ వీడియోను సాయంత్రం చూస్తే.. అందులో ఖాళీ సిరంజితోనే ఇంజక్షన్‌ చేసినట్లు ఉంది. ప్లాస్టిక్‌ కవర్‌ నుంచి సిరంజిని బయటకు తీసిన నర్సు.. వ్యాక్సిన్‌ను లోడ్‌ చేయకుండానే  ఇంజక్షన్‌ చేసింది.  ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో  నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆమెను విధుల్లోంచి తొలగించారు. తాను సరదా కోసమే వీడియో తీశానని, ఇంజక్షన్‌ చేస్తున్నప్పుడు స్నేహితుడు ఎలా ఫీలయ్యాడో తిరిగి చూపించేందుకు రికార్డు చేశానని బాధితుడి మిత్రుడు చెబుతున్నాడు. తీరా వీడియోలో చూస్తే అసలు వ్యాక్సిన్‌ ఎక్కించకుండానే ఇంజక్షన్ చేసినట్లు తేలిందన్నాడు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని