బ్రిటన్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్..!

కొత్త రకం కరోనా వైరస్‌ వెలుగుచూడటంతో ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది.

Updated : 22 Dec 2020 13:14 IST

కొత్త రకం వైరస్‌ వెలుగు చూసిన తరుణంలో ఆందోళన

ముంబయి:  కొత్తరకం కరోనా వైరస్‌ వెలుగుచూడటంతో ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. బ్రిటన్‌లో బయటపడిన ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం యునైటెడ్ కింగ్‌డమ్(యూకే), మధ్యప్రాచ్య దేశాల నుంచి ముంబయికి చేరుకున్న ప్రయాణికులను అధికారులు సంస్థాగత క్వారంటైన్‌కు తరలించారు. దీనిపై బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్  కమిషనర్ స్పందించారు. విదేశాల నుంచి వచ్చే వారిని సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచుతున్నామన్నారు. ఎటువంటి లక్షణాలు కనిపించని వారు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని, లక్షణాలు ఉన్న వ్యక్తులను జీటీ ఆసుపత్రిలో చేరుస్తామని తెలిపారు. అయితే, ప్రభుత్వం ఈ విషయాన్ని తమకు ముందుగా తెలియజేయాల్సిందని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

యూకే నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్..
కొత్త రకం కరోనా వైరస్ ఆందోళనల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం యూకే నుంచి చెన్నై(తమిళనాడు)కు  చేరుకున్న వ్యక్తికి మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆ వ్యక్తి దిల్లీ నుంచి చెన్నైకు చేరుకున్నారని తెలియడంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని సంస్థాగత క్వారంటైన్‌లో ఉంచారు. వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కాంటాక్ట్ ట్రేసింగ్‌ను ప్రారంభించారు. అలాగే ఆ వ్యక్తిలో బయటపడిన వైరస్‌ కొత్త రకానిదా..? కాదా?అనే విషయాన్ని తేల్చేందుకు నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఇదిలా ఉండగా..ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత్, బ్రిటన్ మధ్య నడిచే విమానాలను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

లండన్‌ నుంచి వచ్చిన విమానంలో ఐదుగురికి..

సోమవారం రాత్రి ఎయిరిండియా విమానంలో లండన్‌ నుంచి దిల్లీకి చేరుకున్న ప్రయాణికుల్లో ఐదుగురికి కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిటిష్ ఏయిర్‌వేస్‌లో మంగళవారం ఉదయం దేశ రాజధానికి చేరుకున్న ప్రయాణికుల నమూనాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు. వారి ఫలితాలు రావాల్సి ఉంది. కొత్త రకం వైరస్ వెలుగుచూసిన తరుణంలో.. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో పలువురికి వైరస్‌ సోకడం కలవరపెడుతోంది. మరోవైపు గత రెండు వారాల్లో యూకే నుంచి భారత్‌కు వచ్చిన వారు వైరస్‌ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

ఇవీ చదవండి:

20 వేల దిగువకు కరోనా కేసులు

కరోనా టీకా తీసుకున్న జో బైడెన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని