COVID 19: కరోనాతో చనిపోయాడని అనుకున్నారు కానీ రెండేళ్లకు తిరిగొచ్చాడు..!

కరోనాతో చనిపోయాడనుకున్న ఓ వ్యక్తి రెండేళ్లకు తిరిగి ప్రత్యక్షమైన ఘటన ఇది. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో వెలుగుచూసింది. 

Published : 16 Apr 2023 14:42 IST

భోపాల్‌: రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి కరోనా (Corona)తో పోరాడుతూ మృతి చెందాడు. దీంతో ఆస్పత్రి వర్గాలు మృతదేహాన్ని అప్పగించగా.. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు అదే వ్యక్తి మళ్లీ ఇంటి ముందు ప్రత్యక్షం కావడం గమనార్హం. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ధార్‌ (Dhar) జిల్లాలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.

పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. 2021లో కరోనా రెండో వేవ్‌ సమయంలో కమలేశ్‌ పాటిదార్ (35) అనే వ్యక్తి వైరస్‌ బారినపడ్డాడు. దీంతో అతన్ని గుజరాత్‌లోని వడోదరలో ఓ ఆస్పత్రిలో చేర్చారు. మహమ్మారితో పోరాడుతూ అతను మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతదేహాన్ని అప్పగించగా.. అప్పటి నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులు అక్కడే అంత్యక్రియలు నిర్వహించి, స్వస్థలానికి చేరుకున్నారు.

ఇది జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత అతను కరోడ్కల గ్రామంలోని ఇంటికి చేరుకున్నాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి.. ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇన్నాళ్లు ఎక్కడున్నావని ప్రశ్నించగా.. అతని నుంచి సమాధానం రాలేదు. దీంతో వారు అధికారులను ఆశ్రయించారు. కమలేశ్‌ను విచారించిన అనంతరం ఈ విషయంలో స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని