Sabarimala: ముగిసిన మండల పూజ.. 41రోజుల్లో 30లక్షల మంది దర్శనం

అయ్యప్ప భక్తులతో శబరిమల మారుమోగింది. మండల పూజలో భాగంగా 41 రోజుల్లో మొత్తం 30లక్షల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Published : 28 Dec 2022 00:03 IST

తిరువనంతపురం: కేరళలోని శబరిమల (Sabarimala) అయ్యప్ప క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. 41రోజులపాటు కొనసాగిన మండల పూజ (Mandala Puja) మంగళవారం రోజున సన్నిధానంలో జరిపిన ప్రత్యేక పూజలతో పూర్తయ్యింది. వేలాదిమంది భక్తుల సమక్షంలో మండల పూజ ముగిసిందని ఆలయ ప్రధానార్చకులు వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 30లక్షల మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి మూడు రోజులపాటు ఆలయాన్ని మూసివేసి.. డిసెంబర్‌ 30నుంచి భక్తులను  అనుమతించనున్నారు.

41 రోజులపాటు కొనసాగిన మండల పూజ సమయంలో శబరిమల అయ్యప్పను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నట్లు రాష్ట్ర దేవాదయశాఖ మంత్రి రాధాకృష్ణన్‌ వెల్లడించారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 30లక్షల మంది సందర్శించారని చెప్పారు. అయినప్పటికీ వివిధ విభాగాల సమన్వయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూశామని అన్నారు. గత 39 రోజుల్లో మొత్తం రూ.223 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు (TDB) వెల్లడించింది.

మరోవైపు.. మండలపూజ పూర్తికావడంతో మూడు రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ‘మకరవిళక్కు’ కోసం డిసెంబర్​ 30 సాయంత్రం 5గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. జనవరి 14, 2023న మకర జ్యోతి దర్శనంతో మకరవిళక్కు పూర్తవుతుంది. అనంతరం జనవరి 20వరకు భక్తులను అనుమతించి.. అదే రోజు ఆలయన్ని మూసివేస్తారు. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా రోజుకు 30 వేల మంది భక్తులనే అనుమతించగా.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో లక్ష దాటింది. దీంతో శబరిమల ఆలయం భక్తులతో మారుమోగింది. డిసెంబర్‌ రెండో వారం నుంచి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని