Omicron: పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. కేంద్ర మంత్రి సమీక్ష

దేశంలో మరోసారి కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో.. వైరస్‌ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేస్తోంది. ఇదే క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌...

Published : 02 Jan 2022 18:22 IST

దిల్లీ: దేశంలో మరోసారి కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో.. వైరస్‌ కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలు జారీ చేస్తోంది. ఇదే క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆదివారం ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్త్‌ మినిస్టర్లు, ఉన్నతాధికారులతో ఆన్‌లైన్‌ వేదికగా సమావేశమయ్యారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి, వైద్య వ్యవస్థల సన్నద్ధత, ప్రికాషన్‌ డోసులు, 15-18 ఏళ్లవారికి టీకాల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు.

విదేశాల్లో.. మునుపటి వేవ్‌లతో పోలిస్తే ప్రస్తుతం కేసుల పెరుగుదల 3- 4 రెట్లు అధికంగా ఉందని మాండవీయ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో స్థానికంగా మౌలిక వైద్య సదుపాయాలను మరింత మెరుగుపరచాలని రాష్ట్రాలకు సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని, పరీక్షలు పెంచాలని, కఠినమైన ఆంక్షలను అమల్లోకి తీసుకురావాలని చెప్పారు. ఒమిక్రాన్‌పై పోరాటంలో.. ఇదివరకటి అనుభవాలను ఉపయోగించుకోవాలన్నారు.

ప్రధానంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై దృష్టి సారించాలని మాండవీయ సూచించారు. ఈ క్రమంలో వీక్లీ ప్లానింగ్‌ను సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా త్వరలో ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాలు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. 15-18 ఏళ్లలోపువారికి టీకాల కోసం ఎన్ని డోసులు అవసరమో వివరాలు సమర్పించాలని చెప్పారు. ఎమర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ ప్యాకేజీ నిధుల్లో 17 శాతమే ఖర్చు చేశారని.. బెడ్‌ల ఏర్పాటు తదితర మౌలిక వసతుల కోసం వాటిని వినియోగించాలన్నారు. టెలిమెడిసిన్‌, టెలికన్సల్టేషన్‌ విధానాలను ప్రోత్సహించాలని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని