Manipur: ప్రత్యేక పాలన కావాలన్న ఎమ్మెల్యేలు.. తోసిపుచ్చిన సీఎం!

మణిపుర్‌లో ‘కుకీ’ల జనాభా అధికంగా ఉన్న జిల్లాలను కలిపి ‘ప్రత్యేక పాలన యంత్రాంగం’ ఏర్పాటు చేయాలని స్థానికంగా వస్తోన్న డిమాండ్‌ను సీఎం బీరేన్‌ సింగ్‌ తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రాదేశిక సమగ్రతను కాపాడతామన్నారు.

Published : 15 May 2023 21:35 IST

ఇంఫాల్‌: హింసాత్మక ఘటనలతో ఇటీవల ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur) అట్టుడికిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనల్లో దాదాపు 73 మంది మరణించారు. 1700 ఇళ్లు దహనమయ్యాయి. ఈ క్రమంలోనే గిరిజన ‘కుకీ(Kuki)’ల జనాభా అధికంగా ఉండే జిల్లాలను కలిపి ‘ప్రత్యేక పాలన యంత్రాంగం (Separate Administration) ’ ఏర్పాటు చేయాలని స్థానికంగా 10 మంది ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు. అందులో ఏడుగురు అధికార భాజపాకు చెందినవారే కావడం గమనార్హం. అయితే, వారి డిమాండ్లను సీఎం బీరేన్‌ సింగ్‌ (Biren Singh) తోసిపుచ్చారు. మణిపుర్‌ ప్రాదేశిక సమగ్రతను కాపాడతామని ఆయన స్పష్టం చేశారు.

ఘర్షణలతో అతాలకుతలమైన రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు సున్నితంగా ఉన్న నేపథ్యంలో.. ధర్నాలు, ర్యాలీలు చేపట్టవద్దని ప్రజలకు సీఎం బీరేన్‌ సింగ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. రాష్ట్ర పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మణిపుర్ ప్రాదేశిక సమగ్రతను అన్నివిధాలా పరిరక్షిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నా. అమిత్‌ షాకు రాష్ట్ర ప్రజల మనోభావాలు తెలియజేశాం’ అని తెలిపారు. ఇటీవలి హింసలో సాయుధ మిలిటెంట్ల ప్రమేయంపై విచారణ చేపడుతున్నామన్నారు.

‘ఇటీవలి హింసాకాండలో అనేక మంది అమాయకులు మరణించారు. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో బాధితుల పునరావాసంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని బీరేన్‌ సింగ్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మెజారిటీలుగా ఉన్న మెయిటీలకు గిరిజనుల(ఎస్టీ) హోదా కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, ఇంఫాల్‌ లోయ, దాని చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లోని రక్షిత అటవీ ప్రాంతాల నుంచి గిరిజనులను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలూ హింసకు ఆజ్యం పోశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు