మణిపూర్‌ హింస.. నేనేం తప్పు చేశాను.. నన్నెందుకు చంపారు అంకుల్‌!

అప్పటి వరకు తన తోటి పిల్లలతో కలిసి ఆడుకున్న టోన్సింగ్‌ తలను ఏదో వేగంగా తాకుతూ వెళ్లింది. అంతే, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ శబ్దానికి అక్కడకు చేరుకున్న అతని తల్లి కొడుకు పరిస్థితి చూసి తల్లడిల్లిపోయింది.

Updated : 07 Jun 2023 19:48 IST

(ప్రతీకాత్మక చిత్రం)

గువహతి: మణిపూర్‌(Manipur)లో కాంగ్‌చుప్‌ (Kangchup)కు చెందిన ఎనిమిదేళ్ల టోన్సింగ్‌ హాంగ్సింగ్‌ (Tonsing Hangsing)కు అమ్మ, నాన్నే లోకం. రోజూ తన తోటి పిల్లలతో కలిసి స్కూలుకు వెళ్లడం.. ఆడుకోవడమే దినచర్య. గత నెల రోజుల క్రితం వరకు సజావుగా సాగిన అతని జీవితం.. రాష్ట్రంలో చెలరేగిన హింసతో ఒక్కసారిగా తలకిందులైంది. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో హింస చెలరేగడంతో వారి కుటుంబం మొత్తం కాంగ్‌చుప్‌ దగ్గర్లోని అస్సాం రైఫిల్స్‌ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి చేరుకున్నారు. టోన్సింగ్‌ తల్లి మెయిటీ వర్గానికి చెందిన మహిళ. తండ్రి కుకీ వర్గానికి చెందిన వ్యక్తి. వీరిది ప్రేమ వివాహం. 

ఎప్పటిలానే టోన్సింగ్ ఆదివారం సాయంత్రం పునరావాస కేంద్రంలో తన తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. అంతలోనే తుపాకి పేలిన శబ్దం.. అక్కడి నుంచి పరిగెత్తేలోపే టోన్సింగ్‌ తలను ఏదో వేగంగా తాకుతూ వెళ్లడంతో కిందకు పడిపోయాడు. ఒక్కసారిగా తల నుంచి రక్తం కారడం మొదలైంది. ఆ శబ్దానికి అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరపడంతో అవతలి వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయి. అప్పటికే అక్కడకు చేరుకున్న టోన్సింగ్‌ తల్లి, కొడుకుని ఆ పరిస్థితిలో చూసి తల్లడిల్లిపోయింది. భద్రతా దళాలు వెంటనే స్థానిక పోలీసులతో మాట్లాడి అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి, టోన్సింగ్‌ను అందులో ఎక్కించారు. అతని తల్లి, ఆమెకు తోడుగా బంధువు ఎక్కారు. టోన్సింగ్‌ను మెరుగైన చికిత్స కోసం ఇంఫాల్‌లోని రిమ్స్ ఆస్పత్రి తీసుకెళ్లాలని అంబులెన్స్‌ సిబ్బందికి అస్సాం రైఫిల్స్‌ అధికారి సూచించారు. 

అంబులెన్స్‌ సిబ్బంది కూడా టోన్సింగ్‌ను కాపాడాలని వేగంగా ముందుకు పోనిచ్చారు. మరికొద్దిసేపట్లో ఇంఫాల్‌ రిమ్స్‌కు చేరుకుంటారనగా.. ఇరోయ్‌సెంబా (Iroisemba) ప్రాంతంలో ఆందోళనకారులు అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు అంబులెన్స్‌కు నిప్పు పెట్టారు. క్షణాల్లో మంటలు అంబులెన్స్‌ మొత్తం వ్యాపించడంతో టోన్సింగ్ తల్లి, బంధువు ఆ మంటల్లో దుర్మరణంపాలయ్యారు. అంబులెన్స్ సిబ్బంది మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన గురించి తెలిసి అక్కడున్న వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, మహిళలపట్ల ఆందోళనకారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గత నెల రోజులుగా మణిపూర్‌లో తీవ్ర హింస చెలరేగుతోంది. నిన్న కుకీ మిలిటెంట్లకు.. భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాను మృతి చెందగా ఇద్దరు అస్సాం రైఫిల్స్‌ జవాన్లకు గాయాలయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతను ఈ నెల 10 సాయంత్రం 3 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతపై ఇద్దరు మణిపుర్‌ వాసులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు