Delhi Liquor scam: దిల్లీ మద్యం కుంభకోణం కేసు.. సిసోదియా సహాయకుడి అరెస్టు

దిల్లీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ డిప్యూటీ సీఎం సిసోదియా సహాయకుడు విజయ్‌ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. విజయ్‌ నాయర్‌తో పాటు మరో 14 మందికి మద్యం కుంభకోణంతో...

Published : 28 Sep 2022 01:25 IST

దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ డిప్యూటీ సీఎం సిసోదియా సహాయకుడు విజయ్‌ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. విజయ్‌ నాయర్‌తో పాటు మరో 14 మందికి మద్యం కుంభకోణంతో సంబంధాలు ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. వీరిలో వివిధ ఇంటర్నెట్‌ ఫ్లాట్‌ఫామ్‌లలో కామెడీ షోలు నిర్వహించే సంస్థలు కూడా ఉన్నట్లు  చెబుతోంది. వీటిలో విజయ్‌ నాయర్‌తో సంబంధం ఉన్న కంపెనీలు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఇది దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భయపడి, రాజకీయంగా ఆయన్ను దెబ్బతీసేందుకు భాజపా ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ఆప్‌ ఆరోపిస్తోంది. ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయంగా కేజ్రీవాల్‌ ఎదుగుతున్నారన్న ఉద్దేశంతోనే భాజపా కుటిల యత్నాలు చేస్తోందని మండిపడుతోంది. 

కొత్త ఎక్సైజ్‌ విధానంలో.. కొన్ని లోపాలు ఉన్నాయని, టెండర్ల జారీ తర్వాత మద్యం లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా దీన్ని తయారుచేశారని దిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గతంలో ఓ నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా ఈ విధానంపై దర్యాప్తు జరపాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సీబీఐకి గతంలో సిఫార్సు చేశారు. నూతన మద్యం విధానంలో చోటుచేసుకున్న నియమాల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు మద్యం లైసెన్సుల మంజూరులో అవకతవకలకు పాల్పడారన్న ఆరోణలతో డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియాను సీబీఐ నిందితుడిగా చేర్చింది. మరోవైపు, విపక్షాల నుంచి విమర్శలు ఎదురవ్వడంతో గత నవంబర్‌లో ఈ విధానంపై ఆప్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ విధానం ప్రకారం.. మద్యం సేవించేవారి వయసు 21 ఏళ్లకు తగ్గించడం, షాపుల సంఖ్య పెంచడం, వీటి విక్రయాలను పూర్తిగా ప్రైవేటుకే అప్పగించడంతోపాటు మద్యం దుకాణాలకు సూపర్‌మార్కెట్లుగా నిర్వహించుకునేందుకు వీలు కల్పించింది. తద్వారా అధిక రెవెన్యూను రాబట్టుకోవచ్చని భావించింది. అయితే, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను రంగంలోకి దించి భాజాపా ఈ విధానాన్ని అడ్డుకుంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts