Delhi liquor scam: మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేసిన ఈడీ

మద్యం కుంభకోణం కేసులో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోణలతో ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది.

Updated : 09 Mar 2023 19:27 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు (Delhi liquor scam)లో అరెస్టయిన దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా(Manish Sisodia) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ (CBI) అరెస్టు చేసిన తర్వాత బెయిల్ మంజూరు కాకముందే మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా ఆయన్ను అరెస్టు చేసింది. సిసోదియా ప్రస్తుతం తీహాడ్‌ జైలులో ఉంటున్నారు. ఈయనకు బెయిల్‌ మంజూరు విషయంలో శుక్రవారం దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఈడీ ఆయన్ని అరెస్టు చేయడం గమనార్హం. గత రెండు రోజులుగా తిహాడ్‌ జైలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో సిసోదియాను ప్రశ్నించిన ఈడీ.. తాజాగా ఆయన్ను అరెస్టు చేసినట్లు ప్రకటించింది. రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

మద్యం కుంభకోణం కేసులో ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేసిన తర్వాత బెయిల్‌ కోసం సిసోదియా తొలుత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే,  పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్‌దారుకి ట్రయల్‌ కోర్టు, దిల్లీ హైకోర్టుల నుంచి రక్షణ పొందే వీలుండగా నేరుగా సుప్రీంకోర్టు (Supreme Court)కు రావడమేంటని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో ఆయన బెయిల్‌ కోసం దిల్లీ కోర్టును ఆశ్రయించారు. బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ.. రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.మార్చి 4న దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాదనలను శుక్రవారానికి వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు జరగాల్సిన తరుణంలో మరో దర్యాప్తు సంస్థ ఆయన్ని అరెస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.

దిల్లీ మద్యం విధానంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా 2022 జులై 20న కేంద్ర హోంశాఖకు లేఖ రాయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు జరపాలని ఆదేశిస్తూ హోంశాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సీబీఐ అవినీతి నిరోధక విభాగానికి లేఖరాయడంతో సీబీఐ కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా సిసోదియా పేరును చేర్చింది.  సమాంతరంగా ఇదే కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ ఇప్పటి వరకు సమీర్‌ మహేంద్రు, విజయ్‌నాయర్‌, పి.శరత్‌చంద్రారెడ్డి, బినయ్‌బాబు, అభిషేక్‌ బోయిన్‌పల్లి, అమిత్‌ అరోడా, మాగుంట రాఘవరెడ్డిలను అరెస్ట్‌ చేసింది.

సిసోదియాను ఈడీ అందుకే అరెస్టు చేసింది.. కేజ్రీవాల్‌

మనీశ్‌ సిసోదియాను ఈడీ అరెస్టు చేయడంపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ‘‘మనీశ్‌ను తొలుత సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐకి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఎక్కడా వారికి డబ్బు దొరకలేదు. శుక్రవారం మనీశ్ బెయిల్‌ పిటిషన్‌ విచారణ ఉంది. ఆయన రేపు విడుదలయ్యేవారు. అందువల్ల ఈరోజే సిసోదియాను ఈడీ అరెస్టు చేసింది. వాళ్ల లక్ష్యమంతా ఒక్కటే.. ఎట్టిపరిస్థితుల్లో మనీశ్‌ను లోపలే ఉంచడం. రోజుకో కొత్త నకిలీ కేసును సృష్టిస్తుండటం ప్రజలు చూస్తున్నారు. సమాధానం చెబుతారు’’ అని ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని