Delhi Liquor scam: సిసోదియా కస్టడీ మళ్లీ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Scam) లో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోదియా ఈడీ కస్టడీని దిల్లీ కోర్టు మరో 5 రోజులపాటు పొడిగించింది.

Published : 17 Mar 2023 18:25 IST

దిల్లీ: మద్యం కుంభకోణం (Delhi Liquor scam)లో దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా కస్టడీని దిల్లీ కోర్టు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. కేసు దర్యాప్తులో ఈడీ కస్టడీ నేటితో ముగియడంతో అధికారులు ఆయన్ను దిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున వారం రోజుల పాటు కస్టడీని పొడిగించాలని అధికారులు కోరారు. అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం 5 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

విచారణ సమయంలో  ఈడీ, సిసోదియా తరఫు న్యాయవాదుల మధ్య వాదోపవాదనలు తీవ్ర స్థాయిలో జరిగాయి. రోజులో కేవలం అరగంట నుంచి గంటపాటు మాత్రమే అధికారులు ప్రశ్నిస్తున్నారని, దీనికోసం సిసోదియాను జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఏడు రోజులు కాదు.. ఏడు నెలల గడువు ఇచ్చినా ఈడీ అధికారులు మరింత సమయం కోరుతారని తెలిపారు. ‘‘కస్టడీ గడువును పొడిగించాలని ఈడీ కోరడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. నేరాల ద్వారా ఎంత ఆదాయం వచ్చిందన్న దానిపైనే ఈడీ విచారణ చేయగలదు. కానీ, నేరాలపై విచారణ చేయలేదు. అది సీబీఐ పని’’ అని కోర్టుకు తెలిపారు. కేవలం కక్షపూరితంగానే ఈడీ కస్టడీ పొడిగించాలని కోరుతోంది. అంతే తప్ప.. ఈ దర్యాప్తు విషయంలో కస్టడీ అవసరం లేదని కోర్టుకు వివరించారు.

సిసోదియా తరఫు న్యాయవాది వాదనలను ఈడీ ఖండించింది. సీబీఐ కేసు కారణంగా తీవ్ర మానసికక్షోభకు గురవుతున్నానని సిసోదియా చెప్పారని, అందుకే విచారణకు తక్కువ సమయం కేటాయిస్తున్నామని వివరణ ఇచ్చింది. నేరాన్ని కప్పిపుచ్చేందుకు సిసోదియా పలుమార్లు తన మొబైల్‌ ఫోన్లను మార్చారని, దీనివల్ల దాదాపు 1.38 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ కోర్టుకు వివరించింది. సీబీఐ, ఈడీలు మొదటి రిమాండ్‌ రిపోర్టులోనే ఈ విషయాన్ని ప్రస్తావించాయని, మళ్లీ దీనికోసమే కస్టడీ కావాలా? అని సిసోదియా తరఫు న్యాయవాది ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటి నుంచి ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈడీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఐదు రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో సిసోదియాను తొలుత సీబీఐ అరెస్టు చేసిన తర్వాత ఫిబ్రవరి 26 నుంచి ఆయన తిహాడ్‌ జైల్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్‌ కేసులో ఆయన్ను జైలులోనే ప్రశ్నించిన ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని