Manish Sisodia: 16 మంది నిందితుల్లో సిసోదియా నం.1: సీబీఐ ఎఫ్‌ఐఆర్‌

దిల్లీలోని మద్యం విధానంపై దాఖలైన కేసులో 16మంది నిందితుల పేర్లు ఉంటే, అందులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా పేరు మొదటి స్థానంలో ఉందని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ వెల్లడిస్తోంది.........

Published : 19 Aug 2022 20:46 IST

దిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో మద్యం విధానంపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లో 16మంది నిందితుల పేర్లు ఉంటే, అందులో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా పేరు మొదటి స్థానంలో ఉందని సీబీఐ పేర్కొంది. 16మందితో కూడిన ఈ జాబితాలో సిసోదియా పేరు మొదట్లో ఉన్న ఓ జాబితా వెలుగులోకి వచ్చింది. ఈ జాబితాలో అప్పటి ఎక్సైజ్ శాఖ కమిషనర్ అర్వ గోపీకృష్ణ సహా మరో ముగ్గురు అధికారులు ఉన్నారు. 2021-22 కాలంలో దిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అవకతవకలు జరిగాయని, మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు ఈ నివేదిక పేర్కొంటోంది.

మద్యం విధానంపై దాఖలైన కేసు విచారణలో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా నివాసంలో సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. సాయంత్రం సమయానికి కూడా ఈ సోదాలు కొనసాగుతుండటం గమనార్హం. సిసోదియా నివాసంతో పాటు దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని 21 చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.అబ్కారీ టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూర్చేలా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సిసోదియా పాత్రనూ అందులో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ.. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం సోదాలు చేపట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని