Sisodia: కేంద్రం కూడా కాదట.. మరి ఆ నిర్ణయం ఎవరిది?

దేశ రాజధానిలోని రోహింగ్యా ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్‌) ఫ్లాట్లకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వం......

Published : 18 Aug 2022 18:08 IST

దిల్లీ: దేశ రాజధానిలోని రోహింగ్యా ముస్లింలను ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్‌) ఫ్లాట్లకు తరలించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరేంటో చెప్పాలని దిల్లీ హోంమంత్రి, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా కోరారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాసినట్టు ఆయన వెల్లడించారు. రోహింగ్యాలను ప్లాట్లలోకి తరలించాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించలేదన్నారు. కేంద్రం కూడా తాము అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని చెబుతోందని.. మరి ఈ నిర్ణయం తీసుకున్నదెవరని ప్రశ్నించారు. రోహింగ్యా ముస్లింలను ఫ్లాట్లలోకి తరలించే నిర్ణయం ఎవరి సూచనల మేరకు తీసుకున్నారో తేల్చేందుకు విచారణ జరిపించాలని అమిత్‌ షాను కోరినట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘రోహింగ్యాలకు ఫ్లాట్‌లు ఇచ్చే పథకం ఉందని దిల్లీ సీఎంకు గానీ, నాకు గానీ తెలియదు. ఈ విషయం పత్రికల ద్వారానే తెలిసింది. అయితే తాను అధికారులను దీనిపై ప్రశ్నిస్తే.. ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర అధికారులు కొన్ని సమావేశాల్లో పాల్గొన్నారని చెప్పారు. ఆ సమావేశం వివరాలను అడిగినప్పుడు అవి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం నేరుగా సీఎస్‌ నుంచి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పంపుతున్నట్టు ఫైల్స్‌లో కనబడింది. ప్రజల ద్వారా ఎన్నికైన దిల్లీ ప్రభుత్వానికి సైతం తెలియకుండా ఈ కుట్రలు ఎందుకు?’’ అని సిసోడియా ప్రశ్నించారు.

ఈ అంశంపై పరస్పర ప్రకటనలతో గందరగోళం తలెత్తిన తరుణంలో కేంద్ర హోంశాఖ దేశ ప్రజలకు ఓ స్పష్టత ఇవ్వాలని సిసోడియా కోరారు. అయితే, రోహింగ్యాలను ఫ్లాట్లలోకి తరలించే అంశాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ కూడా ప్రకటన జారీ చేసిందన్న సిసోడియా.. మరి ఈ నిర్ణయం తీసుకున్నదెవరని నిలదీశారు. ఇంకోవైపు, నిన్న రోహింగ్యా ముస్లింలను శరణార్థులుగా పేర్కొన్న కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌ వారిని దిల్లీలోని బకర్‌వాలా ప్రాంతంలోని ఈడబ్ల్యూఎస్‌ ఫ్లాట్లకు తరలిస్తామని.. వారికి మౌలిక వసతులతో పాటు పోలీస్‌ భద్రత కల్పిస్తామంటూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.  అయితే, కొద్దిగంటల్లోనే కేంద్రహోంశాఖ దీనికి భిన్నమైన ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని