Published : 18/04/2021 19:11 IST

మహమ్మారి అంతానికి మన్మోహన్‌ సూచనలు!

మోదీకి లేఖ రాసిన మాజీ ప్రధాని

దిల్లీ: కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే కీలక మార్గమని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన మహమ్మారిని ఎదుర్కొనేందుకు కావాల్సిన కొన్ని సూచనలు చేస్తూ ప్రధాని మోదీకి ఆదివారం ఓ లేఖ రాశారు. కరోనా రెండో దఫా విజృంభిస్తున్న తరుణంలో ఆయన లేఖ రాయడం గమనార్హం.

వ్యాక్సిన్లు తీసుకున్నవారి సంఖ్య ముఖ్యం కాదని.. మొత్తం దేశ జనాభాలో ఎంత శాతం మందికి టీకా ఇచ్చామన్నదే అసలు విషయమని మన్మోహన్‌ తెలిపారు. ఆ విషయంలో భారత్‌ చాలా వెనుకబడి ఉందన్నారు. సరైన విధానాల రూపకల్పనతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా, వేగంగా కొనసాగించవచ్చని తెలిపారు. మహమ్మారి పారదోలడానికి ఇంకా చాలా చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడమే అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.

లేఖలో మన్మోహన్‌ ప్రస్తావించిన కీలక అంశాలు..

* వివిధ వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలకు కరోనా టీకాల కోసం ప్రభుత్వం పెట్టిన ఆర్డర్ల వివరాలను వెల్లడించాలి. వీటిలో రానున్న ఆరు నెలల్లో అందే టీకాలు ఎన్ని?అవి ఎక్కడి నుంచి రాబోతున్నాయో తెలియజేయాలి. సరైన సమయంలో ఎక్కువ మందికి టీకా అందించాలంటే తగినన్నీ టీకా డోసులకు ముందుగానే ఆర్డర్‌ చేసి ఉంచాలి.

* వివిధ కంపెనీల నుంచి అందే టీకాలను రాష్ట్రాల మధ్య ఎలా పంచబోతున్నారో వివరించాలి. అత్యవసర పరిస్థితుల కోసం కేంద్రం 10 శాతం టీకాల్ని తమ వద్ద ఉంచుకోవచ్చు. మిగిలిన వాటిని రాష్ట్రాలకు ఎలా పంచబోతున్నారో తెలియజేస్తే.. రాష్ట్రాలు అందుకనుగుణంగా ప్రణాళికలు రచించుకునే అవకాశం ఉంటుంది.

* ఎవరిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తించాలనే విషయంపై రాష్ట్రాలకు కొంత వెసులుబాటు కల్పించాలి. స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని రాష్ట్రాలు లాయర్లు, టీచర్లు, ట్యాక్సీ డ్రైవర్లను సహా మరికొన్ని వర్గాలకు చెందిన వారికి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తించాలనుకుంటోంది. తద్వారా కొవిడ్‌ ముప్పు ఉన్న కొంత మందికి టీకా ముందుగానే అందే అవకాశం ఉంటుంది.

* ప్రస్తుతం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలకు కేంద్రం ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలతో అండగా ఉండాలి. ఫలితంగా ఆయా కంపెనీలకు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అవసరమైతే నిధులు, రాయితీలతో అండగా నిలవాలి. 

* దేశీయంగా టీకా సరఫరా కొరత ఉన్న నేపథ్యంలో.. ఐరోపా మెడికల్‌ ఏజెన్సీ, యూఎస్‌ఎఫ్‌డీఏ వంటి ప్రాధికార సంస్థలు ఆమోదించిన టీకాలకు ఎలాంటి షరతులు లేకుండానే భారత్‌కు దిగుమతి చేసుకునేందుకు అనుమతించాలి. భారత్‌లో ప్రయోగాలకు వీటికి తాత్కాలికంగా మినహాయింపునివ్వాలి. ఇలాంటి అత్యవసర సమయంలో ఈ ప్రతిపాదనకు నిపుణులు సైతం ఆమోదిస్తారని భావిస్తున్నాను. అయితే, ఈ విషయాలను టీకా తీసుకునే వారికి ముందుగానే తెలియజేయాలి. ప్రభుత్వం ఈ సూచనల్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నానంటూ మన్మోహన్‌ తన లేఖను ముగించారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని