Published : 26 Sep 2021 18:42 IST

PM Modi Mann Ki Baat: నదుల పరిరక్షణకు సమష్టి కృషి అవసరం

మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

దిల్లీ: నదులను కాలుష్య రహితం చేసేందుకు దేశ ప్రజల సమష్టి కృషి అవసరమని ప్రధాని మోదీ అన్నారు. నదులు కేవలం ప్రకృతి సంబంధమైనవే కావని.. తల్లి ఇచ్చే జీవితంతో సమానమని పేర్కొన్నారు. నదులు నీటిని దాచుకోకుండా నిస్వార్థంగా ఇతరులకు అందిస్తాయన్నారు. ప్రపంచ నదుల దినోత్సవం (సెప్టెంబరు 26) నేపథ్యంలో 81వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.

‘‘నదులు కలుషితం కాకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. తమిళనాడులోని నాగ నది ఒకప్పుడు పూర్తిగా ఎండిపోయింది. కానీ గ్రామీణ మహిళల చొరవ, ప్రజల భాగస్వామ్యంతో ఆ నదికి మళ్లీ జీవం వచ్చింది. ప్రస్తుతం నదిలో పుష్కలంగా నీరు ఉంది.  దేశానికి పశ్చిమాన ఉన్న ప్రాంతాలు ప్రత్యేకించి గుజరాత్, రాజస్థాన్‌లు నీటి కొరతతో అల్లాడుతుంటాయి. అలాంటి గుజరాత్‌లో వర్షాకాలంలో జల్-జిలాని ఏకాదశిని జరుపుతారు. ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టుకోవాలని పండగను ఘనంగా నిర్వహిస్తారు. అంతేకాకుండా బిహార్, కొన్ని తూర్పున ఉన్న రాష్ట్రాల్లో ఇదే తరహాలో ‘ఛత్‌’ పండగను జరుపుకొంటారు. ఈ పండగ సందర్భంగా అక్కడి ప్రజలు నదీతీరాలను, ఘాట్‌లను శుభ్రం చేస్తారు. నదుల పరిరక్షణకు దేశ ప్రజలందరూ నడుం బిగించాలి. ఏటా ఒక్కసారైనా న‌ది పండగ (River festival) చేసుకోవాలి’’ అని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. నదుల పరిశుభ్రత, వాటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేశారు. నదుల పరిరక్షణకు కృషి చేస్తున్న వారిని ప్రధాని ప్రశంసించారు. ఇప్పటివ‌ర‌కు తాను అందుకున్న కానుకల‌ను ప్రత్యేకంగా ఈ-వేలం వేసి వచ్చిన మొత్తాన్ని ‘నమామీ గంగే క్యాంపెయిన్‌’కు అంకితం చేస్తున్నట్లు వెల్లడించారు.

‘‘మనం ఇంకా కొవిడ్‌తో యుద్ధం కొనసాగిస్తున్నాం. వ్యాక్సినేషన్‌లో మన దేశం ప్రతిరోజు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఈ ‘సురక్ష చక్రం’(వ్యాక్సిన్) బయట ఎవరూ ఉండరాదు. పండగలు వస్తున్నాయి. ఈ పర్వదినాల్లో కొవిడ్‌ పోరాటం గురించి కూడా గుర్తుంచుకోవాలి.  వ్యాక్సినేషన్‌లో భారత్‌ సాధించిన రికార్డుల గురించి యావత్‌ ప్రపంచంలో చర్చ జరుగుతోంది. మన వంతు వచ్చినపుడు వ్యాక్సిన్‌ తప్పక తీసుకోవాలి. వ్యాక్సిన్‌ తీసుకున్నా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. ప్రతి ఒక్కరు కొవిడ్‌ టీకా వేయించుకొని ఇతరులను కూడా టీకా తీసుకునేలా ప్రోత్సహించాలి’’ అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి (అక్టోబరు 2) సందర్భంగా స్థానిక హస్తకళాకారులను ప్రోత్సహించడానికి ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని