Updated : 29/11/2020 12:29 IST

తాజా చట్టాలతో రైతులకు మరిన్ని అవకాశాలు

మన్‌ కీ బాత్‌లో ప్రధాని మోదీ

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలు రైతుల కష్టాల్ని దూరం చేసి వారికి కొత్త అవకాశాలు, హక్కుల్ని కల్పిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సుదీర్ఘ చర్చ తర్వాతే పార్లమెంటులో వాటికి చట్టబద్ధత లభించిందని తెలిపారు. అతి తక్కువ సమయంలో రైతులు వీటి ఫలాల్ని అందుకుంటున్నారన్నారు. రైతులు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో భారీ ఎత్తున ఆందోళన కొనసాగిస్తుండగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త చట్టాల ప్రకారం.. పంట కొనుగోలు పూర్తయిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ కావాలని ప్రధాని గుర్తుచేశారు. లేనిపక్షంలో అన్నదాతలకు ఫిర్యాదు చేసే హక్కు ఉంటుందని తెలిపారు. రైతుల ఫిర్యాదులను జిల్లా సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేట్‌ నెలలోపు పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. జితేంద్ర సింగ్‌ అనే రైతు ఇటీవల ఫిర్యాదు చేయగా.. నెల లోపే ఆయన సమస్యను పరిష్కరించారని ప్రధాని తెలిపారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారమయ్యే మన్‌ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నేడు ప్రధాని తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా మోదీ పలువురు రైతుల చేస్తున్న వినూత్న కృషిని ప్రశంసించారు. ‘‘మహమ్మద్‌ అస్లాం అనే రైతు.. తన చుట్టూ ఉండే రైతులతో ఓ వాట్సాప్‌ గ్రూప్‌ సృష్టించారు. ఆ ప్రాంతంలోని వివిధ రైతు బజార్లలో పంట ఉత్పత్తుల ధరలు వంటి సమాచారాన్ని వారితో పంచుకుంటారు. ఆయన సొంతంగా కూడా రైతుల పంటల్ని కొనుగోలు చేస్తారు. రైతులు తమ ఉత్పత్తుల్ని ఎక్కడ విక్రయించాలో నిర్ణయించుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది’’ అని ప్రధాని తెలిపారు.

మన సంపద మనకు చేరుతోంది..

భారత్‌ నుంచి విదేశాలకు అక్రమంగా తరలివెళ్లిన అనేక పురాతన విగ్రహాలు, వస్తువులు తీసుకురావడంలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ క్రమంలో త్వరలో కెనడా నుంచి 100 ఏళ్ల నాటి అన్నపూర్ణాదేవీ విగ్రహం తిరిగి రానుందని వెల్లడించారు. దాదాపు 1913వ సంవత్సరంలో ఈ విగ్రహాన్ని కొంత మంది దుండగులు దొంగిలించి విదేశాల్లో అమ్మేశారని తెలిపారు. కెనడా ప్రభుత్వంతో మాట్లాడి భారత్‌కు వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కెనడా ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

వారసత్వ సంపద కాపాడడంలో సాంకేతికత..

దేశవ్యాప్తంగా ఉన్న ప్రదర్శనశాలలు, గ్రంథాలయాలు పూర్తిగా డిజిటలీకరణ దిశగా సాగుతున్నాయని ప్రధాని తెలిపారు. ఈ క్రమంలో దిల్లీలోని నేషనల్‌ మ్యూజియం కొన్ని ప్రతిష్ఠాత్మక చర్యలు చేపట్టిందని తెలిపారు. త్వరలో 10 వర్చువల్‌ గ్యాలరీలు ప్రారంభించే దిశగా సాగుతోందన్నారు. ప్రపంచ వారసత్వ వారోత్సవాల వంటి ప్రత్యేక రోజులు మన దేశ సంస్కృతిని, వారసత్వ సంపదను అర్థం చేసుకునేందుకు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. కరోనా సమయంలోనూ ప్రజలు వినూత్న పద్ధతిలో వారోత్సవాలు జరుపుకొన్నారని గుర్తుచేశారు. మన పూర్వీకుల సంపదను కాపాడడంలో సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందన్నారు. త్వరలో అజంతా గుహలను కూడా డిజిటలైజ్‌ చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల భావితరాలకు మన దేశ ఘనమైన వారసత్వ సంపద అందుతుందన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని