Amritpal Singh: ‘ఆపరేషన్‌ అమృత్‌పాల్‌’కు పక్షం రోజులు ముందే నిశ్శబ్దంగా ఏర్పాట్లు..!

ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్‌ను అరెస్టు చేసేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ముందస్తు ప్రణాళికను రచించాయి. వేలకొద్దీ సాయుధబలగాలను పంజాబ్‌లోకి చొప్పించాయి.  

Published : 21 Mar 2023 18:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘వారిస్‌ పంజాబ్‌ దే’ చీఫ్‌, ఖలిస్థానీ నేత అమృత్‌పాల్‌ సింగ్‌(Amritpal Singh)ను కట్టడిచేయడానికి పంజాబ్‌-కేంద్ర ప్రభుత్వాలు చాలా రోజుల ముందే పక్కా ప్లాన్‌ను చేశాయి. కానీ, అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన మూడు జీ-20 సమావేశాలు ప్రతిష్ఠాత్మకంగా మారడంతో అవి ముగిసేవరకు ఓపిగ్గా వేచిచూశాయి. చివరికి శనివారం రామ్‌పూర ఫూల్‌ వద్ద అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఓ రకంగా అమృత్‌పాల్‌(Amritpal Singh) తప్పించుకొన్నా.. అతడి ఆటలు ఇక ఏమాత్రం సాగవనే బలమైన సందేశాన్ని మాత్రం చాలా స్పష్టంగా పంపాయి. 

దాడి జరిగిన వారం లోపే ఏర్పాట్లు మొదలు..

 ఫిబ్రవరి 23వ తేదీన అమృత్‌పాల్‌(Amritpal Singh) అనుచరులు అజ్‌నాల స్టేషన్‌ పై దాడి చేసి అరాచకం సృష్టించారు. ఫిబ్రవరి 28వ తేదీన పంజాబ్‌ ప్రభుత్వం 120 కంపెనీల సాయుధ బలగాలను పంపాలని కేంద్ర హోంశాలఖను కోరింది. అప్పటికే అమృత్‌సర్‌లో మార్చి-15-17 మధ్యలో జీ-20 సమావేశాలు  నిర్వహించేందుకు షెడ్యూల్‌ సిద్ధమైంది. దీంతో అవి సాఫీగా ముగిసే వరకు వేచిచూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

మార్చి 3వ తేదీ పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. ఆ మీటింగ్‌ జరిగిన వెంటనే దాదాపు 2,430 మంది కేంద్ర సాయుధ పోలీస్‌ ఫోర్స్‌ పంజాబ్‌కు బయల్దేరింది. వీటిల్లో 8 కంపెనీల ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ కూడా ఉంది. హోలీ సందర్భంగా జరిగే హోలా మొహల్లా ఉత్సవాల కోసం వీరిని మోహరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ సమయంలో అమృత్‌పాల్‌(Amritpal Singh)ను అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. దీనికి అమృత్‌పాల్‌(Amritpal Singh) స్పందిస్తూ.. తాను అరెస్టులకు భయపడనని గంభీరంగా ప్రకటన కూడా జారీ చేశాడు. 

ఇంటర్నెట్‌పై ఆంక్షలతో మొదలు..

గత శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో ఇంటర్నెట్‌సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర అదనపు చీఫ్‌ సెక్రటరీ అనురాగ్‌ వర్మ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని వర్గాలు హింసను ప్రేరేపించి ప్రజలను గాయపర్చవచ్చని పోలీసు వర్గాలు ఆయన దృష్టికి తీసుకొచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2జీ, 3జీ, 4జీ, 5జీ, సీడీఎంఏ, జీపీఆర్‌ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలను నిలిపివేశారు. కేవలం బ్యాంకింగ్‌ సేవలకు మాత్రమే ఇంటర్నెట్‌ను అనుమతించారు. దీంతోపాటు డాంగిల్‌ ద్వారా అందించే ఇంటర్నెట్‌ సేవలు కూడా శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నాం వరకు ఆపేశారు. ఈ స్థాయి మోహరింపులు ఉన్నా ప్రజలకు ఎటువంటి అనుమానం రాకుండా పోలీసు అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు. ఎందుకంటే అమృత్‌పాల్‌ (Amritpal Singh)శని, ఆదివారాల్లో రాంపూర్‌ఫూల్‌, ముక్తసర్లో రెండు చోట్ల ప్రసంగించాల్సి ఉంది. 

ఎనిమిది జిల్లాల్లో పోలీసుల మోహరింపు..

ఇక అమృత్‌పాల్‌(Amritpal Singh) తరచూ ప్రయాణించే మార్గంలోని  అమృత్‌సర్‌, తరన్‌ తారాన్‌, ఫిరోజ్‌పూర్‌, ఫరీద్‌కోట్‌, ముక్త్‌సర్‌, జలంధర్‌, బటిండా జిల్లాల్లో భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఇది సాధారణ డ్రిల్స్‌లో భాగాంగానే చేపట్టినట్లే పోలీసులు వ్యవహరించారు. జలంధర్‌-మోగా మధ్యలోని మెహతాపూర్‌ వద్ద అతడిని అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రెండు వాహనాల్లో ఉన్న అమృత్‌పాల్‌ అనుచరులను అరెస్టు చేశారు. కానీ, వెనుకాల మూడో వాహనంలో వస్తున్న అమృత్‌పాల్‌ మాత్రం తప్పించుకోగలిగాడు. దీంతో అమృత్‌సర్‌, జలంధర్‌, మోగా, ఫిరోజ్‌పూర్‌ జిల్లాల సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. మరోవైపు అమృత్‌పాల్‌ ఇల్లు ఉన్న జుల్లుపూర్‌ఖేడాను పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకొన్నారు. కేంద్ర సాయుధబలగాలు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ దళాలను అక్కడ గస్తీకి ఉంచారు. అతడు ఆ గ్రామంలోకి ప్రవేశించడం దాదాపు అసాధ్యంగా మార్చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు