అలా చేస్తే.. 2030 కల్లా భారత్‌ దివాలా తీయడం ఖాయం: హరియాణా సీఎం కీలక వ్యాఖ్యలు

పాత పింఛన్‌ విధానం(OPS) వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓపీఎస్‌పై వచ్చిన ఓ సందేశం గురించి వెల్లడించారు. 

Published : 03 Feb 2023 11:14 IST

చండీగఢ్‌: కొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు పాత పింఛను విధానం(ఓపీఎస్‌)(OPS) అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దీనిని ఉద్దేశించి హరియాణా(Haryana) ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌(Manohar Lal Khattar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓపీఎస్‌ను అమలు చేస్తే.. 2030 నాటికి భారత్‌ దివాలా తీస్తుందన్నారు.

చండీగఢ్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నిన్న నాకు వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. ఓపీఎస్‌ను  అమలు చేస్తే.. 2030 కల్లా దేశం దివాలా తీస్తుందని ఆ సందేశంలో ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వెల్లడించారు’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ విధానాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ కూడా వ్యతిరేకించారని గుర్తుచేశారు. ‘మన్మోహన్‌ సింగ్‌ గొప్ప ఆర్థికవేత్త. 2006లో ఓ సందర్భంలో ఆయన దీనిని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. ఇది భారత్‌ను తిరోగమనంలోకి నెడుతుందన్నారు’ అని చెప్పారు. ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా(RBI) కూడా దీనిపై రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. 

ఇదిలా ఉంటే.. కొద్దికాలం క్రితం రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌ రాష్ట్రాలు ఈ ఓపిఎస్‌ను పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించాయి. తమ నిర్ణయాన్ని కేంద్రం, పెన్షన్‌ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్‌ అథారిటీ(PFRDA)కి వెల్లడించాయి. పంజాబ్‌ కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. కాగా, నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌(NPS) లేక పాత పింఛను విధానంలో దేన్ని ఎంచుకోవాలనేది రాష్ట్రాల పరిధిలోని అంశమని కేంద్రం పలు సందర్భాల్లో వెల్లడించింది. 

2004 జనవరి 1 తర్వాత నియమితులైన ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ వర్తిస్తుంది. ఈ విధానంలో పింఛను నిధి కింద ప్రతినెలా ఉద్యోగి నుంచి కొంత మొత్తం తీసుకుని, అంతే మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తూ నేషనల్‌ పెన్షన్‌ ఫండ్‌లో జమ చేస్తుంది. ఉద్యోగి పదవీవిరమణ చేసే నాటికి జమ అయిన మొత్తంలో సగం పదవీవిరమణ సందర్భంగా అందజేస్తారు. మిగతా మొత్తాన్ని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టి ఆ మొత్తంపై వచ్చే లాభాలను నెలనెలా పింఛను రూపంలో అందజేస్తారు. అంటే పెట్టుబడులపై లాభాల ఆధారంగా పింఛను మొత్తం ఎంతనేది ఆధారపడి ఉంటుంది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల సర్కారు జమ చేసే వాటాను 14 శాతానికి పెంచింది.

పాత పింఛను విధానంలో ఇలా..

పాత విధానంలో పింఛను కోసం ఉద్యోగి జీతం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తీసుకోదు. ఉద్యోగి పదవీవిరమణ చేసే నాటికి ఉన్న మూల వేతనం, డీఏ కలిపిన మొత్తంలో 50% పింఛను రూపంలో ప్రతినెలా అందుతుంది. ఫిట్‌మెంట్‌తో పాటు ద్రవ్యోల్బణం మేరకు డీఏ పెరిగి.. ఆ మేరకు పింఛను కూడా పెరుగుతుంది. ఇలా అందే పింఛను సీపీఎస్‌ పింఛను కంటే చాలా ఎక్కువగా ఉండటమే కాకుండా తమ పదవీవిరమణ అనంతరం జీవితానికి భరోసా ఉంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగి మరణిస్తే ఆయన భార్యకు, లేదా దివ్యాంగులైన పెళ్లికాని పిల్లలకు సగం పింఛను అందుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని