Manoj Tiwari: సిసోదియాపై కేజ్రీవాల్ కుట్ర పన్నుతున్నారా..?

దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి సిసోదియాకు జైల్లో ప్రాణహాని ఉందంటూ ఆప్‌ నేతలు ఆరోపణలు చేయగా.. ఆయనకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని భాజపా(BJP) డిమాండ్ చేసింది. 

Updated : 09 Mar 2023 12:35 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైల్లో (Tihar Jail) ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) రక్షణపై ఆమ్‌ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై భాజపా నుంచి ఘాటు స్పందన వచ్చింది. సిసోదియాకు జైల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కమలం పార్టీ నేత మనోజ్‌ తివారీ(Manoj Tiwari) డిమాండ్ చేశారు. 

‘దిల్లీ జైళ్లు.. దిల్లీ(Delhi) ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు సంబంధించిన ఎన్నో రహస్యాలు సిసోదియాకు తెలుసు. తన సన్నిహితుడికి తన ప్రభుత్వం ఆధీనంలోని జైలులో ప్రాణహాని ఎలా ఉంటుంది? సిసోదియా నోటి నుంచి ఎటువంటి రహస్యాలు బయటకు రాకుండా ఆయన్ను చంపేందుకు కేజ్రీవాల్‌ ఏమైనా కుట్రపన్నుతున్నారా? ఈ క్రమంలో భాజపా నుంచే ప్రాణహాని ఉందని ప్రచారం చేస్తూ.. ఒక అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. సిసోదియాకు సాధ్యమైనంత వరకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని జైలు అధికారులను అభ్యర్థిస్తున్నాను’ అని తివారీ వ్యాఖ్యానించారు. 

సిసోదియా రక్షణపై ఇదివరకు ఆప్‌(AAP) నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా, కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నాయి. ఆయనపై మోపిన తప్పుడు అభియోగాలపై సంతకం పెట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి. ప్రమాదకరమైన నేర చరిత్ర కలిగిన ఖైదీలున్న జైలు నంబర్‌1లో మనీశ్‌ సిసోదియా(Manish Sisodia)ను ఉంచారు. దీంతో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది’ అని ఆప్‌ సీనియర్‌ నేత సంజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి నేరస్థులతో పాటు సిసోదియాను ఉంచారని ఆ పార్టీ సీనియర్‌ నేత దిలీప్‌ పాండే ఆరోపించారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన జైలు అధికారులు.. సిసోదియా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆయన్ను జైలు నంబర్‌ 1లో ఉంచామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని