Covid Vaccine: భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్‌ నాసికా టీకా ‘ఇన్‌కొవాక్‌’ను కేంద్ర మంత్రులు మన్‌సుఖ్‌ మాండవీయ, జితేంద్ర సింగ్‌లు గురువారం విడుదల చేశారు. కరోనాకు ఇది ప్రపంచంలోనే తొలి నాసికా టీకా.

Updated : 26 Jan 2023 20:05 IST

దిల్లీ: కొవిడ్‌(Covid 19) నివారణకు భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన నాసికా టీకా ‘ఇన్‌కొవాక్(iNCOVACC)‌’ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ(Mansukh Mandaviya), కేంద్ర శాస్త్రసాంకేతికశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌(Jitendra Singh) గురువారం అధికారికంగా విడుదల చేశారు. ముక్కు ద్వారా వేసే ఈ చుక్కల మందును వాషింగ్టన్‌ యూనివర్సిటీ- సెయింట్‌ లూయీస్‌ సహకారంతో భారత్‌ బయోటెక్‌‌(Bharat Biotech) అభివృద్ధి చేసింది. కరోనాకు ఇది ప్రపంచంలోనే తొలి నాసికా టీకా(Nasal Vaccine). 18 ఏళ్లు దాటిన వారికి దీన్ని రెండు ప్రాథమిక డోసులుగా, బూస్టర్‌ డోసుగానూ వినియోగించవచ్చు. ఈ కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, సంస్థ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్ల.. తదితరులు పాల్గొన్నారు.

‘ఇన్‌కొవాక్‌’ ఇప్పటికే కొవిన్‌ పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటుకు ఒక డోసు ధర రూ.800(జీఎస్‌టీ అదనం) కాగా, ప్రభుత్వాలకు రూ.325(జీఎస్‌టీ అదనం)కు అందించనున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఇటీవల వెల్లడించింది. ఈ వారం నుంచే ఈ టీకా మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ‘ఇన్‌కొవాక్‌ వల్ల టీకా ఇవ్వడం, రవాణా, నిల్వ ఎంతో సులువవుతుంది. ఈ టీకాను అధికంగా ఉత్పత్తి చేసే అవకాశమూ ఉంటుంది. తద్వారా మహమ్మారిపై పోరాటానికి మరొక పదునైన అస్త్రం లభించినట్లయింది’ అని డాక్టర్‌ కృష్ణ ఎల్ల గత వారం వెల్లడించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని