
ముదురుతున్న ‘తలపాగా’ వివాదం
బెంగాల్ పోలీసుల తీరును ఖండించిన ప్రముఖులు
వివరణ ఇచ్చిన పోలీసులు
దిల్లీ: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం చుట్టూ తలపాగా వివాదం చుట్టుకుంటోంది. ఓ సిక్కు నిరసనకారుడితో పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీస్తోంది. కోల్‌కతా సమీపంలోని హావ్డాలో భాజపా నిర్వహించిన ‘నాబన్నా ఛలో’ నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీందో పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలోనే పోలీసులు బల్విందర్‌సింగ్ అనే ఓ సిక్కు నిరసనకారుడిని బలవంతంగా అదుపులోకి తీసుకుంటుండగా అతడి తలపాగా ఊడిపోయింది. అయినా వదిలిపెట్టని పోలీసులు అతడిపై లాఠీఛార్జీ చేశారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాన్నో అవమానకర ఘటనగా పేర్కొన్నారు. సిక్కుల మనోభావాలు దెబ్బతీసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బెంగాల్ ముఖ్యమంత్రిని కోరారు. అమరీందర్‌సింగ్ మీడియా సలహాదారు రవీన్ థాక్రుల్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఆ ఘటనను ఖండించారు. ‘పోలీసులు ఆ తరహాలో ప్రవర్తించి ఉండాల్సింది కాదు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సిక్కు యువకుడి తలపాగాను లాగివేయడంతో సిక్కుల మనోభావాలు తెబ్బతిన్నాయి’ అంటూ ట్వీట్ చేశారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలిదల్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ సైతం ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. దానిని ఓ ‘దుర్మార్గపు దాడి’గా అభివర్ణించారు. ‘ తలపాగాకు జరిగిన అవమానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సోదరులను రెచ్చగొట్టింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మమతా బెనర్జీని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు. భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌సింగ్ కూడా ట్వీట్ చేశారు. ఆ ఘటనపై దృష్టిసారించాల్సిందిగా బెంగాల్ సీఎంని కోరారు.‘సింగ్ అరెస్టును భాజపా జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ ఖండించారు. అతడి తలపాగాను లాగి బెంగాల్ పోలీసులు దేశంలోని సిక్కులను అగౌరపరిచారు. ఆ రాష్ట్రంలో మళ్లీ మొఘలుల పాలన కొనసాగుతున్నట్లు అనిపిస్తోంది. బెంగాల్లో ఒక ప్రత్యేక మతానికి తప్ప మరే ఇతర మతాల మనోభావాలకు గౌరవం లేదా?’ అంటూ ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా తమపై వస్తున్న ఆరోపణలను బెంగాల్ పోలీసులు ఖండించారు. ‘నిరసనకారుడిని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో జరిగిన పెనుగులాటలో టర్బన్ దానంతట అదే ఊడిపోయింది. తలపాగాను లాగేయాలనే ఉద్దేశం మాకు లేదు. అతడిని పోలీసుస్టేషన్‌కు తరలించేముందు తిరిగి తలపాగా చుట్టుకోవాల్సిందిగా కోరాం’ అని ట్వీట్ చేశారు. ఆ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. బల్విందర్‌సింగ్ వద్ద నుంచి లైసెన్స్‌లేని 9ఎంఎం తుపాకీ ఉందని, దానిని స్వాధీనం చేసుకొని అతడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బల్విందర్‌సింగ్ బెంగాల్‌లోని ఓ భాజపా నేతకు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు బెంగాల్ భాజపా చీఫ్ దిలీప్ ఘోష్ వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.