2030 నాటికి 23 జల మార్గాలు: ప్రధాని మోదీ

దేశంలో గత కొంతకాలంగా పెరిగిన పోర్టుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 2030 నాటికి 23 జల మార్గాలను అందుబాటులోకి తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 02 Mar 2021 23:44 IST

దిల్లీ: దేశంలో గత కొంతకాలంగా పెరిగిన పోర్టుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 2030 నాటికి 23 జల మార్గాలను అందుబాటులోకి తెస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం జల మార్గాల కోసం భారీ పెట్టుబడులు పెడుతోందని వివరించారు. జలమార్గాలు అత్యంత చౌకగా ఉండడమే కాకుండా పర్యావరణ హితమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ‘మారిటైమ్‌ ఇండియా సదస్సు -2021’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

దేశంలో ఉన్న కోస్తా తీరం వెంబడి ఇప్పటికే 189 లైట్‌హౌస్‌లు ఉండగా వీటిలో 78 ప్రాంతాల్లో పర్యటకాన్ని అభివృద్ధి చేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2014లో ఏటా దాదాపు 870 మిలియన్‌ టన్నులు ఉన్న పోర్టుల సామర్థ్యం.. ప్రస్తుతం 1550 మిలియన్‌ టన్నులకు పెరిగిందని తెలిపారు. ఈ ఉత్పాదకత కేవలం పోర్టులకే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఎంతో దోహదపడతాయని వెల్లడించారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఓడరేవుల రంగంలో 2035కల్లా 82 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెడతామన్నారు. అంతేకాకుండా ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను కూడా భారీగా ప్రోత్సహిస్తామని స్పష్టంచేశారు. సముద్ర రంగంలో భారత్‌కు గొప్ప చరిత్ర ఉందని, ఈ రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

వర్చువల్‌ పద్ధతిలో నిర్వహించిన మారిటైమ్‌ సదస్సులో కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో పాటు కోస్తాతీర రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘మారిటైమ్‌ ఇండియా విజన్‌ 2030’ ఈ-బుక్‌ను ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని