Anand Mahendra: ఐడియా అదుర్స్‌.. ఆనంద్‌ మహీంద్రా మెచ్చిన ‘మ్యారేజ్‌ హాలు’.. ప్రత్యేకత ఇదే!

సృజనాత్మకత ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రశంసించి మరింతగా ప్రోత్సహించడం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra). క్రియేటివ్‌ అంశాలతో.....

Published : 26 Sep 2022 02:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సృజనాత్మకత ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రశంసించి మరింతగా ప్రోత్సహించడం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra). క్రియేటివ్‌ అంశాలతో పాటు స్ఫూర్తిదాయకమైన కథనాలు, వీడియోలను సోషల్‌ మీడియాలో అందరితో పంచుకొనే ఈ పారిశ్రామిక దిగ్గజం.. తాజాగా ఓ ‘మొబైల్‌ మ్యారేజ్ హాలు’ వీడియోను షేర్‌ చేశారు. షిప్పింగ్‌ కంటైనర్‌ని ఓ అద్భుతమైన కల్యాణ వేదికగా మలచిన ఆలోచనకు ముగ్దుడైన ఆయన.. దీన్ని డిజైన్‌ చేసిన వ్యక్తిని కలవాలనుకుంటున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇది చాలా క్రియేటివ్‌గా ఉందని.. మారుమూల ప్రదేశాల్లోనూ మంచి సదుపాయాలు అందిస్తుందన్నారు. అంతేకాకుండా ఇది పర్యావరణ అనుకూలమైనదని.. అత్యధిక జనసాంద్రత కలిగిన మన దేశంలో శాశ్వతంగా స్థలం అవసరం ఉండదని పేర్కొన్నారు. 

ఆ వీడియోలో ఏముంది?

40 అడుగుల పొడవు కలిగిన షిప్పింగ్ కంటైనర్‌లో ఫోల్డ్‌ చేసేలా కొన్ని ప్రత్యేక భాగాలు ఉన్నాయి. ఇది తెరుచుకున్నప్పుడు కంటైనర్‌ వెడల్పు 30 అడుగుల వరకు విస్తరిస్తుంది. కంటైనర్‌ను కల్యాణ వేదికలా కనిపించేలా దాదాపు 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో మంచి స్టైలిస్‌ ఇంటీరియర్‌ డిజైన్లతో పాటు సకల హంగులతో తీర్చిదిద్దారు. మామూలుగా నగరాల్లోని కల్యాణ వేదికలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఏసీలు, భోజన వసతులు ఇతర సౌకర్యాలతో అతిథ్యం కల్పించేలా ఏర్పాటు చేసిన ఈ మొబైల్‌ మ్యారేజ్‌ హాల్‌  ఆకట్టుకుంటోంది. ఈ కల్యాణ మండపానికి దాదాపు 200 మందికి ఆతిథ్యం కల్పించే సామర్థ్యం ఉంది.  ఫోల్డ్‌ చేసుకొనే వెసులుబాటుతో ఉన్న దీంట్లో రెండు ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. వివాహాలే కాకుండా ఇతర ఈవెంట్ల కోసమూ దీన్ని వేదికగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆలోచన గురించి గ్రామస్థుడిని అడగ్గా.. ఇది విభిన్న ప్రదేశాల్లో వాడుకొనే సౌలభ్యం కలిగి ఉండటమే కాకుండా వర్షా కాలంలోనూ బహిరంగ వేదికలకు ఇదో గొప్ప ప్రత్యామ్నాయమంటూ చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని