PMAY: ఆవాస్‌ యోజన డబ్బు చేతికి.. భర్తలను వదిలేసి లవర్స్‌తో జంప్‌!

‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద మొదటి విడత సాయం పొందిన పలువురు వివాహితలు.. తమ భర్తలను వదిలేసి నచ్చినవారితో పారిపోయినట్లు తేలింది.

Published : 09 Jul 2024 15:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పేదల సంక్షేమంలో భాగంగా పక్కాఇళ్ల నిర్మాణానికి ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’ కింద కేంద్రం ఆర్థికసాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా పలు రాష్ట్రాల్లో వేల మంది లబ్ధి పొందుతున్నప్పటికీ.. కొన్నిచోట్ల అది దుర్వినియోగం అవుతున్నట్లు వెల్లడైంది. ఈ పథకం కింద మొదటివిడత సాయం పొందిన పలువురు వివాహితలు.. తమ భర్తలను వదిలేసి నచ్చినవారితో పారిపోయినట్లు తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

యూపీలోని మహరాజ్‌గంజ్‌ జిల్లాలో ఇటీవల 2,350 మందికి ఆవాస్‌ యోజన నగదు విడుదలైంది. తొలివిడతగా రూ.40 వేలు చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యింది. ఇదే సమయంలో తమ భార్యలు ప్రేమికులతో/నచ్చిన వారితో వెళ్లిపోయారంటూ అనేకమంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇలా జిల్లాలో 11 కేసులు నమోదైనట్లు సమాచారం. టుత్తిబరీ, షీత్లాపుర్‌, చాతియా, రామ్‌నగర్‌, బకుల్‌ డీహా, ఖాస్రా, కిషున్‌పుర్‌, మెథౌలీలో ఈ కేసులు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఈ పథకం కింద రెండోవిడత నగదును నిలిపివేయాలని నిర్ణయించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

యూట్యూబర్‌ బుర్రలో బూతు పురుగు!

పీఎంఏవై పథకం కింద పక్కా ఇళ్ల నిర్మాణం కోసం పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాయితీ రూపంలో గరిష్ఠంగా రూ.2.5 లక్షల వరకు ఆర్థికసాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అయితే, ఇందుకు మహిళలే కుటుంబ యజమాని/సహ యజమానిగా ఉండాలనే నిబంధన ఉంది. ఈ క్రమంలోనే ఈ పథకం ద్వారా ఆర్థికసాయం అందిన వెంటనే పలువురు వివాహితలు తమ భర్తలను విడిచిపెట్టి వెళ్లిపోవడం స్థానికంగా  తీవ్ర చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని