Priyanka Gandhi: గాంధీ కుటుంబాన్ని BJP నిత్యం అవమానిస్తోంది : ప్రియాంక

ఎన్నో విధాలుగా రాహుల్‌ గాంధీని భాజపా (BJP) నిత్యం అవమానిస్తున్నా ఇన్నిరోజులు మౌనంగానే ఉన్నామని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) పేర్కొన్నారు. రాహుల్‌పై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ దిల్లీలో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆమె..  అహంకారపూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే సమయం ఆసన్నమైందన్నారు.

Updated : 26 Mar 2023 16:57 IST

దిల్లీ: గాంధీ కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నోసార్లు అవమానాలకు గురిచేసిందని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) పేర్కొన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబ నేపథ్యాన్ని భరించలేని భాజపా.. ‘అమరుడి కుమారుడు’ అంటూ రాహుల్‌ను నిత్యం కించపరుస్తూనే ఉందన్నారు. రాహుల్‌గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటును వ్యతిరేకిస్తూ దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద కాంగ్రెస్‌ (Congress) నేతలు చేపట్టిన ‘సత్యాగ్రహ దీక్ష’లో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. జాతీయ సమైక్యత కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఆ అమర ప్రధానమంత్రి కుమారుడు మాత్రం దేశాన్ని ఎన్నడూ అవమానపరచలేదని స్పష్టం చేశారు.

సమయం ఆసన్నమైంది..

‘అమరుడి కుమారుడు, ద్రోహి, మీర్‌ జాఫర్‌ అంటూ నా సోదరుడిని ఎన్నో పేర్లతో పిలుస్తున్నారు. భాజపా మంత్రులు కూడా మా తల్లిని పార్లమెంటులో అవమానించారు. కొందరు నేతలు మా తల్లిని కించపరుస్తూ మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. నెహ్రూ కుటుంబం పేరును వీళ్లెందుకు ఉపయోగించరంటూ ప్రశ్నించారు. ఇలా ఎన్నోరకాలుగా మమ్మల్ని అవమానపరిచిన వాళ్లపై మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయినా మేం మౌనంగానే ఉన్నాం. రాహుల్‌ గాంధీ వేసే ప్రశ్నలకు భయపడుతోన్న భాజపా.. సమాధానం చెప్పలేకే ఆయన్ను వేధిస్తోంది. దేశం కోసం నా కుటుంబం పోరాడింది.. ఈ భూమిలో నా కుటుంబ సభ్యుల రక్తం ఉంది. ఈ దేశ ప్రజాస్వామ్యం నా కుటుంబ రక్తంతో ముడిపడి ఉంది’ అని భాజపా తీరుపై ప్రియాంక గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. ఇటువంటి అహంకారపూరిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే సమయం ఆసన్నమైందన్నారు.

రాజకీయాల్లో లేకుండా చేయాలని..

‘రాహుల్‌ గాంధీపై మోపిన తప్పుడు కేసులను దేశమంతా గమనిస్తోంది. ప్రజాస్వామ్యం, భావప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవాలి. కర్ణాటకలో చేసిన వ్యాఖ్యలపై సూరత్‌లో కేసు నమోదు చేసి విచారణల పేరుతో రాహుల్‌ను వేధించారు. రాహుల్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలని భాజపా చూస్తోంది. ఆయన గొంతుకను మూగబోయేలా చేయాలన్నదే భాజపా కుట్ర. ఆయన ఎవ్వరికీ భయపడరు. శిరస్సు ఖండించినా తలవంచని అలవాటు రాహుల్‌ది. దేశాన్ని, స్వాతంత్ర్యాన్ని , ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎలాంటి త్యాగాలు చేయాల్సి వచ్చినా మేము చేస్తాం’ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.

లోక్‌సభలో రాహుల్‌ గాంధీపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఒకరోజు ‘సంకల్ప్‌ సత్యాగ్రహ’ను చేపట్టింది. దిల్లీలోని రాజ్‌ఘాట్‌ దగ్గర నేతలంతా కలిసి నిరసన దీక్షకు దిగారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సహా సీనియర్‌ నేతలు చిదంబరం, సల్మాన్‌ ఖుర్షీద్‌, జైరామ్‌ రమేశ్‌, పవన్‌ కుమార్‌ బన్సల్‌, ముకుల్‌ వాస్నిక్‌, ఇతర నేతలు ఇందులో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని