Corona: రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించండి: కేంద్రం కీలక సూచన

ప్రపంచ దేశాల్లో కొవిడ్‌(Corona) కేసులు పెరుగుతుండటంపై కేంద్రం కీలక సూచనలు చేసింది. ప్రజలు రద్దీ ప్రాంతాల్లో మాస్కు(Mask)లు ధరించాలని సూచించింది.

Updated : 21 Dec 2022 15:56 IST

దిల్లీ: ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా (Corona Virus) కేసులు అకస్మాత్తుగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కు(Mask)లు ధరించాలని సూచించింది. చైనా, జపాన్‌, అమెరికా సహా పలు దేశాల్లో ఈ మహమ్మారి పరిస్థితులపై అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ( (Mansukh Mandaviya) అధ్యక్షతన దిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై కరోనా పరిస్థితులను చర్చించి చర్యలు తీసుకొనేందుకు ప్రతివారం ఈ ఉన్నత స్థాయి కమిటీ భేటీ కావాలని నిర్ణయించారు.

ప్రపంచ దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్న వేళ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌మాండవీయ ఆదేశించారు. ‘‘కరోనా ఇంకా ముగిసిపోలేదు. అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత పటిష్టం చేయాలని అధికారుల్ని ఆదేశించాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌, జాతీయ టీకా సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగి NTAGI) ఛైర్మన్‌ ఎన్‌.ఎల్‌.ఆరోడా, ఐసీఎంఆర్‌ డీజీ డా. రాజీవ్‌ బహల్‌, ఇతర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, ఆరోగ్య, ఆయుష్‌, ఔషధ, బయోటెక్నాలజీ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

బూస్టర్‌ డోసు వేసుకోండి..

ఈ సందర్భంగా కరోనాపై ఏర్పాటుచేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ అధిపతిగా ఉన్న వీకే పాల్‌ మాట్లాడుతూ.. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. తగినన్ని పరీక్షలు చేస్తున్నామని.. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. ఇప్పటివరకు కేవలం 27-28శాతం మంది మాత్రమే అర్హులైనవారు బూస్టర్‌ డోసు వేసుకున్నారని.. అర్హులైన ప్రతిఒక్కరూ వేసుకోవాలని సూచించారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ఇంకా ఎలాంటి మార్పులూ లేవన్నారు.

జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్‌ పంపండి!

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతండటంతో అప్రమత్తమైన కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేసింది. వైరస్‌ కొత్త వేరియంట్‌లను ఎప్పటికప్పుడు గుర్తించడానికి గాను పాజిటివ్‌ నమూనాల పూర్తి జన్యు క్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. దీనికోసం కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన నమూనాలను ప్రతి రోజు సార్స్‌ కోవ్‌-2 జినోమిక్స్‌ కన్సార్టియం(ఇన్సాకాగ్‌) పరీక్షా కేంద్రాలకు పంపించాలని సూచించారు. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. క్రియాశీల కేసులు 4వేల దిగువనే ఉన్నాయి. అయితే, చైనా సహా జపాన్‌, దక్షిణ కొరియా, బ్రెజిల్‌, అమెరికా దేశాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 10కోట్లు దాటింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలపై దృష్టిపెట్టింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు