సీరమ్‌ సంస్థలో భారీ అగ్నిప్రమాదం

ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రధాన కార్యాలయంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని టర్మినల్‌ 1 గేట్‌ వద్ద పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి.

Updated : 21 Jan 2021 17:20 IST

పుణె: ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన నూతన ప్లాంట్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని మంజరి ప్రాంతంలో గల సీరమ్‌ ప్రాంగణంలోని నిర్మాణ దశలో ఉన్న సెజ్‌ 3 భవనంలోని నాలుగు, ఐదు అంతస్తుల్లో ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది 10 అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. భవనంలో చిక్కుకున్న ముగ్గురిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. 

కరోనాపై పోరులో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కొవిషీల్డ్‌ టీకాలను ఉత్పత్తి చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అగ్నిప్రమాదం జరిగిన భవనం.. కొవిషీల్డ్‌ టీకాలు తయారవుతున్న భవనానికి దూరంగా ఉంది. దీంతో వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం కలగలేదని సంస్థ వర్గాలు వెల్లడించాయి. 

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా సంస్థ 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. తయారీ సామర్థ్యాన్ని చేపట్టేందుకు సంస్థ ప్రాంగణంలో కొత్తగా మరో ఎనిమిది భవనాలు నిర్మిస్తున్నారు. తాజాగా ఇందులోని ఒక భవనంలో మంటలు చెలరేగాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటన గురించి తెలియగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సంస్థ పుణె పోలీసులతో మాట్లాడారు. త్వరితగతిన చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆదేశించారు. 

స్పందించిన అదర్‌ పూనావాలా

ఘటనపై అదర్‌ పూనావాలా ట్విటర్‌ వేదికగా స్పందించారు. అగ్నిప్రమాదం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని తెలిపారు. భవనంలోని కొన్ని అంతస్తులు ధ్వంసమయ్యాయని అన్నారు. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టామని, ఆస్తి నష్టం గురించి తర్వాత అంచనా వేస్తామని చెప్పారు. 
 

టీకా వేయించుకోనున్న ప్రధాని! 

అందరికీ టీకా లభిస్తుంది: ప్రపంచ ఆరోగ్య సంస్థ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని