Updated : 23 Jun 2022 11:43 IST

Corona: దేశంలో ఆగని కొవిడ్‌ ఉద్ధృతి.. ఆ IIT చెప్పిందే నిజం కానుందా?

దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసుల (corona Virus) గ్రాఫ్‌ మళ్లీ పైకి ఎగబాకుతోంది. జనవరి తర్వాత గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో నమోదవుతున్న కొత్త కేసులు కలవరపెడుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 8,084 కొత్త కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కేవలం వారంలోనే దాదాపు 50వేల కొత్త కేసులు నమోదవ్వడం.. రోజురోజుకీ ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతుండటంతో ఇది నాలుగో వేవ్‌కు (fourth wave) సంకేతమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోర్త్‌ వేవ్‌పై ఐఐటీ కాన్పూర్‌ పరిశోధకులు వేసిన అంచనా తాజాగా చర్చనీయాంశంగా మారింది.

ఫోర్త్‌ వేవ్‌పై పరిశోధకులేం చెప్పారు?

జూన్‌లో కరోనా నాలుగో వేవ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని కాన్పూర్‌ ఐఐటీ పరిశోధకులు తెలిపారు. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఫోర్త్‌వేవ్‌ ప్రభావం ఉండొచ్చని అప్పట్లో అంచనా వేశారు. ఈ దశ తీవ్రత ఎలా ఉంటుందో మాత్రం చెప్పలేమన్నారు. కొత్త వేరియంట్లు, మ్యుటేషన్లు, వ్యాక్సిన్‌, బూస్టర్‌ డోసుల ఆధారంగా నాలుగో దశ తీవ్రత ఆధారపడి ఉంటుందని అప్పట్లో వారు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం ప్రీప్రింట్‌ సర్వర్‌ MedRxivలో ప్రచురితమైంది. ఫోర్త్‌వేవ్‌ దాదాపు నాలుగు నెలల పాటు ఉంటుందని.. ఆగస్టు 15 నుంచి 31 వరకు కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరుకొని ఆ తర్వాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు. గత మూడు వేవ్‌ల సమయాల్లో నమోదైన కరోనా కేసులు, పీక్‌ టైమ్‌, మరణాల సంఖ్యలో ఈ పరిశోధకులు వేసిన అంచనాలు దాదాపు నిజం కావడంతో తాజా ప్రిడెక్షన్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఫోర్త్‌వేవ్‌కు ఛాన్స్‌లు తక్కువేనంటోన్న నిపుణులు

మరోవైపు, మన దేశంలో ప్రస్తుతం ఆందోళన కలిగించే కొత్త వేరియంట్‌ ఏదీ లేదని, తాత్కాలికంగా కేసులు పెరిగినా ఫోర్త్‌వేవ్‌కు ఛాన్స్‌ లేకపోవచ్చని పేర్కొంటున్నారు కొందరు ఆరోగ్యరంగ నిపుణులు. వేసవి సెలవుల్లో ప్రజల కదలికలు పెరగడం, దేశీయ/అంర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల సడలింపు, కొందరు బూస్టర్‌ డోసులు తీసుకోకపోవడంతో పాటు కొవిడ్‌ నిబంధనలను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో కేవలం కొన్ని నగరాల్లో మాత్రమే కేసులు పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. తాజాగా కొత్త కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు స్వల్పమేనని, ఎవరూ దీనిపై భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. అయితే, భారీగా టెస్టులు చేయడంతో పాటు కొవిడ్‌ నిబంధనలను మాత్రం తప్పకుండా పాటించడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని కట్టడి చేయవచ్చని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తోంది. ఏది ఏమైనా తాజాగా కేసులు పెరుగుతుండటంతో ప్రజలంతా కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తేనే వ్యాప్తిని అడ్డుకోగలమని పలువురు కోరుతున్నారు. 

ఆరోగ్యశాఖ పేర్కొన్న గణాంకాల ప్రకారం.. దేశంలో తాజాగా నమోదైన కొత్త కేసులతో ఇప్పటివరకూ కొవిడ్‌ సోకినవారి సంఖ్య 4,32,30,101కు చేరింది. వీరిలో 4,26,57,335 మంది కోలుకోగా.. 5,24,771 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 47,995గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 2.21శాతంగా ఉంది. రికవరీ రేటు 98.68శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.21శాతంగా ఉందని ఆరోగ్యశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి.

గతంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల ఇలా..

మన దేశంలో కొవిడ్‌ వ్యాప్తి మొదలైనప్పట్నుంచి 2020 ఆగస్టు 7నాటికి కేసుల సంఖ్య 20లక్షల మార్కును దాటగా.. ఆగస్టు 23న 30లక్షలు, సెప్టెంబర్‌ 5న 40లక్షలు, సెప్టెంబర్‌ 16న 50లక్షల మార్కును దాటింది. ఆ తర్వాత 60లక్షల మార్కును సెప్టెంబర్‌ 28న దాటగా.. 70లక్షల మార్కును అక్టోబర్‌ 11న, 80లక్షల మార్కును అక్టోబర్‌ 29న, 90లక్షల మార్కును నవంబర్‌ 20న, కోటి కేసుల మార్కును డిసెంబర్‌ 19న క్రాస్‌ చేసింది. ఆ తర్వాత రెండు కోట్ల మార్కును 2021 మే నెలలో చేరగా.. మూడు కోట్ల మార్కును జూన్‌ 23న దాటింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts