రాకాసి ఓడతో రవాణా బంద్‌..!

ప్రపంచ వ్యాపారానికి సూయజ్‌ కాల్వ జీవనాడి లాంటింది. అరబ్‌ దేశాల నుంచి చమురు ఐరోపా దేశాలకు వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం. అంతేకాదు ఐరోపా దేశాల సరుకులు ఆసియాకు చేరాలన్నా ఈ మార్గంలోనే ప్రయాణించాలి.

Updated : 25 Mar 2021 14:53 IST

 సూయజ్‌ సంక్షోభం ఖరీదెంతో తెలుసా..?

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: అంతర్జాతీయ వాణిజ్యానికి సూయజ్‌ కాల్వ జీవనాడి లాంటింది. అరబ్‌ దేశాల నుంచి చమురు ఐరోపా దేశాలతో పాటు అమెరికాకు వెళ్లాలంటే ఈ మార్గమే శరణ్యం. అంతేకాదు ఐరోపా దేశాల సరుకులు ఆసియాకు చేరాలన్నా ఈ మార్గంలోనే ప్రయాణించాలి. ఇది మానవ నిర్మితమైంది కావడంతో ఇరుగ్గా ఉంటుంది. 120 మైళ్ల పొడవు ఉండే ఈ కాల్వ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జలమార్గం.  అలాంటి చోట్ల భారీ నౌక ఇరుక్కుపోవడంతో ప్రపంచ  వ్యాపారంపై ప్రభావం చూపించనుంది. 

ఆ నౌక ఈఫిల్‌ టవర్‌ కంటే పెద్దది..!

ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్‌ నౌకల్లో ఎవర్‌  గివెన్‌ కూడా ఒకటి. తొలుత దీని పేరు ఎవర్‌ గ్రీన్‌ అనుకొన్నారు. కానీ, అది నౌకను లీజుకిచ్చిన కంపెనీ పేరు. 400 మీటర్ల పొడవు.. దాదాపు 60మీటర్ల వెడల్పు ఉన్న ఈ నౌక 20వేల కంటైనర్ల వరకు మోసుకెళుతుంది. ఒకరకంగా ఈ నౌక ఈఫిల్‌ టవర్‌ కంటే పెద్దది. ఈ నౌక బరువు 2.24లక్షల టన్నులు.  ఇప్పుడు ఈ నౌక సూయజ్‌ కాలువలో అడ్డంగా నిలిచిపోయింది.  భారీ సంఖ్యలో కంటైనర్‌ నౌకలు, చమురు ట్యాంకర్లు ఇరువైపులా ఆగిపోయాయి. ఇక ఈ మార్గంలో ప్రపంచ వ్యాపారంలో 12శాతం విలువైన సరుకులు రవాణా అవుతుంటాయి. ఈ కాల్వ మీదుగా ప్రపంచంలో వినియోగించే  ఎనిమిది శాతం ఎల్‌ఎన్‌జీ గమ్య స్థానాలకు చేరుతుంది. ఇక్కడ నౌక చిక్కుకుపోయిన సమాచారంతో చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2.9శాతం పెరిగింది.

పెరిగిపోతున్న నౌకలు..

కొవిడ్‌ బాగా విస్తరించి.. వ్యాపారాలు స్తంభించిన గతేడాదే ఈ మార్గంలో మొత్తం 19,000 భారీ నౌకలు ప్రయాణించాయి. అంటే రోజుకు సగటున 51కంటే ఎక్కువ నౌకలు ప్రయాణిస్తాయన్నమాట. సూయజ్‌ కెనాల్‌ అథారిటీ లెక్కల ప్రకారం ఈ మార్గంలో ప్రయాణించినందుకు నౌకల నుంచి వసూలు చేసిన టోలు రూపంలో గతేడాది 6 బిలియన్‌ డాలర్ల (రూ.43.5 వేల కోట్లు) ఆదాయం వచ్చింది.  వ్యాక్సినేషన్‌ ఊపందుకోవడంతో వ్యాపారాలు పుంజుకొని ఇప్పుడు రద్దీ మరింత పెరిగింది. ఇక్కడ నౌకలు కాన్వాయ్‌ పద్దతిలో వెళతాయి. ఈ క్రమంలో వేగం, నౌకల మధ్య దూరంపై ఆంక్షలు ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంతో సూయజ్‌ కెనాల్‌ వద్ద భారీగా నౌకలు నిలిచిపోయాయి. 

ప్రత్యామ్నాయ మార్గంలో వెళితే..

ఈ కాల్వను దాటేందుకు నౌకను బట్టి 11 నుంచి 18 గంటల సమయం పడుతుంది. కాల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కొన్నేళ్ల క్రితం ఓ బైపాస్‌ మార్గాన్ని ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఎవర్‌ గివెన్‌ నౌక బైపాస్‌కు ఇవతలవైపు చిక్కుపోవడంతో ఆ మార్గం కూడా ఉపయోగపడకుండా పోయింది. ఇక సూయజ్‌ కాల్వకు ప్రత్యామ్నాయ మార్గమైన కోప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ మార్గంలో నౌకలు ప్రయాణిస్తే అదనంగా 7,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి వస్తుంది. అంటే ఎంత లేదన్నా కనీసం 14 రోజుల పాటు సముద్ర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అప్పుడు  సరుకు రవాణాకు అయ్యే ఖర్చు తడిసి మోపెడవుతుంది. 

గత 20ఏళ్లలో ఇది మూడోసారి..

సూయజ్‌ కాల్వలో నౌకాయానం నిలిపివేయడం గత 20 ఏళ్లలో ఇది మూడోసారి. అంతకుముందు 2004లో ట్రోపిక్‌ బ్రిలియన్స్‌ అనే నౌక చిక్కుకుపోతే మూడు రోజుల పాటు  కాల్వను మూసివేయాల్సి వచ్చింది. ఇక 2017లో జపాన్‌కు చెందిన ఒక  నౌక కారణంగా కొన్ని గంటల పాటు మూతపడింది. అప్పట్లో ఈ ఓడను నెట్టేందుకు కొన్ని చిన్నసైజు పడవలను ఉపయోగించారు. ఈ సారి కూడా వాటిని వాడుతున్నా.. ‘ఎవర్‌ గివెన్‌’ నౌక ఒక వైపు భాగం కాల్వ ఒడ్డును ఢీకొని అందులో కూరుకుపోవడంతో సమస్యను తీవ్రతరం చేసింది. యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతుండటంతో త్వరలోనే సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని