Published : 26 Jun 2022 01:48 IST

Droupadi Murmu: ద్రౌపదీ ముర్ముకు మాయావతి మద్దతు

దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)కు బీఎస్పీ (BSP) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati ) శనివారం వెల్లడించారు. ఇలా విపక్ష దళాల్లో ఎన్‌డీయే అభ్యర్థికి మద్దతు తెలిపిన తొలి పార్టీ బీఎస్పీయే కావడం గమనార్హం.

భాజపా (BJP)కు మద్దతుగానో.. లేక ప్రతిపక్ష కూటమికి వ్యతిరేకంగానో తాము ఈ నిర్ణయం తీసుకోలేదని మాయావతి అన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలను, తమ ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకునే గిరిజన తెగకు చెందిన అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించామన్నారు. మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో ప్రతిపక్ష కూటమి తమని సంప్రదించలేదని మాయావతి తెలిపారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ఆమె మమతా బెనర్జీ కొన్ని ఎంపిక చేసుకున్న పార్టీలనే పిలిచారని పేర్కొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా అభ్యర్థి ఎంపికపై తమను సంప్రదించలేదని చెప్పుకొచ్చారు.

‘‘దళితుల చేతుల్లో నాయకత్వం ఉన్న ఏకైక జాతీయ పార్టీ బీఎస్పీ. మేం భాజపా లేదా కాంగ్రెస్‌ను అనుసరించేవాళ్లం కాదు. పారిశ్రామికవేత్తలతోనూ చేతులు కలపలేదు. మేం ఎప్పుడూ అణగారిన వర్గాలకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటాం. ఏ పార్టీయైనా అలాంటి వర్గాలకు మద్దతుగా నిర్ణయాలు తీసుకుంటే పర్యవసనాలను పక్కనబెట్టి వారి వెంట నిలుస్తాం’’ అని మాయావతి అన్నారు.

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపదీ ముర్ము శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ ఎన్నికను కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నామినేషన్ల సమయంలోనే ప్రత్యర్థులకు తన సంఖ్యాబలాన్ని చాటిచెప్పే ప్రయత్నం చేసింది. ద్రౌపదీ ముర్ముకు 60 శాతానికిపైగా ఓట్లు వస్తాయని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ధీమా వ్యక్తంచేశారు. ఎన్డీయే మిత్రపక్షాలతోపాటు, బయటినుంచి బీజేడీ, వైకాపా, ఇతర పార్టీలూ మద్దతిస్తున్న నేపథ్యంలో ఈ మైలురాయిని దాటడం ఖాయమన్నారు. దేశంలో తొలిసారి గిరిజన మహిళను అత్యున్నత రాష్ట్రపతి పదవికి పోటీకి నిలబెట్టిన నేపథ్యంలో విభిన్న పార్టీల్లోని బలహీనవర్గాల ఎంపీలూ ఆమెకు మద్దతిచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని