Updated : 19 Feb 2021 12:31 IST

ప్రజలను తిట్టి.. మేయర్‌ పదవికి రాజీనామా చేశాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజల సంక్షేమానికి పాటుపడే చట్టబద్ధమైన మేయర్‌ పదవిలో ఉన్న ఓ వ్యక్తి ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ప్రజలను సోమరులు, బలహీనులంటూ సోషల్‌మీడియాలో పోస్టు పెట్టాడు. విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన మేయర్‌ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

ప్రస్తుతం టెక్సాస్‌లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 23 మంది చలికారణంగా మృతి చెందారు. ఈ తుపాను ధాటికి లక్షలాది మంది ప్రజల ఇళ్లలో విద్యుత్‌, నీటి సరఫరా నిలిచిపోయింది. ఎముకలు కొరికే చలిలో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.  ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్‌లోని కొలరాడో నగర మేయర్‌ టిమ్‌ బాయిడ్‌ తన నగర ప్రజలను ఉద్దేశించి సోషల్‌మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్టు పెట్టాడు.

‘‘సాయం చేయడానికి మీకు ఎవరూ రుణపడి లేరు. ఇలాంటి (మంచు తుపాను విజృంభిస్తున్న) సమయంలో మిమ్మల్ని ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత కాదు. సాయం కోరుతున్న ప్రజలను చూసి చూసి విసిగిపోయాను. ఈ విపత్తులో మునుగుతారో.. క్షేమంగా బయపడతారో మీ ఇష్టం. విద్యుత్‌, నీటి సరఫరా లేకపోతే మీరే ఒక మంచి పరిష్కారం కనిపెట్టండి. అలా కాకుండా ఇంట్లో కూర్చొని ఫిర్యాదులు చేస్తున్నారంటే మీరు సోమరులనే అర్థం. ఈ గడ్డు పరిస్థితుల్లో బలవంతులు బతుకుతారు.. బలహీనులు మరణిస్తారు. మేం నిజంగా ఆపదలో ఉన్నవారిని గుర్తించలేపోతున్నాం. ఇప్పుడు మేం చర్యలు తీసుకుంటే కొందరు ప్రభుత్వ సాయాన్ని దుర్వినియోగం చేసే అవకాశముంది. కాబట్టి ఏడుస్తూ, చేతకాని వారిలా కూర్చొకుండా లేచి మీ కుటుంబాన్ని మీరే కాపాడుకోండి’’అని రాసుకొచ్చాడు. చివరగా పరిష్కారంలో భాగం అవ్వాలని కానీ.. సమస్యలో కాదు అని పేర్కొన్నాడు. 

టిమ్‌ చేసిన ఈ పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. ప్రజాసేవలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హేయమని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో వెంటనే టిమ్‌ బాయిడ్‌ పోస్టును తన తొలగించాడు. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీవ్ర విమర్శలు రావడంతో తాను మేయర్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని తన ఉద్దేశం కాదని.. ఎవరైనా తన వ్యాఖ్యలకు బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ మరో పోస్టు పెట్టాడు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని