Morbi tragedy: మోర్బీ తీగల వంతెన విషాదం.. కోర్టు ముందు లొగిపోయిన ఒరెవా ఎండీ

మోర్బీ ఘటనకు బాధ్యుడైన ఒరెవా గ్రూప్‌ ఎండీ జయ్‌సుఖ్‌ పటేల్‌ కోర్టు ముందు లొంగిపోయారు. ఈ కేసులో పదో నిందితుడిగా ఉన్న ఆయనపై ఇప్పటికే అరెస్ట్‌ వారెంట్‌ జారీ అయ్యింది.

Published : 31 Jan 2023 23:55 IST

మోర్బీ (గుజరాత్‌): మోర్బీ తీగల వంతెన ఘటనలో నిందితుడైన ఒరెవా గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయ్‌సుఖ్‌ పటేల్‌ కోర్టు ముందు లొంగిపోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నారు. అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడం, అరెస్ట్‌ వారెంట్‌ జారీ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులో లొంగిపోయారు. దీంతో పోలీసులు ఆయనను జైలుకు తరలించారు.

గుజరాత్‌లోని మోర్బీలో గతేడాది అక్టోబర్‌ 30న తీగల వంతెన కూలిన దుర్ఘటనలో 135 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ బ్రిడ్జికి సంబంధించి పునరాభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను ఒరెవా గ్రూపే చూస్తోంది. ఈ ఘటనకు సంబంధించి నిందితుల్లో ఒకరైన పటేల్‌పై అరెస్ట్‌ వారంట్‌ జారీ అవ్వడంతో మోర్బీలోని కోర్టు ముందు మంగళవారం లొంగిపోయారు. దీంతో అతడిని జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు అరెస్ట్‌ నుంచి రక్షణ కోసం ముందస్తు బెయిల్‌కు జయ్‌సుఖ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఫిబ్రవరి 1న ఇది విచారణకు రావాల్సి ఉండగానే ఆయన లొంగిపోయారు.

ఇప్పటికే ఈ కేసులో 9 మందిని నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అందులో ఒరెవా గ్రూప్‌నకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు టికెట్‌ బుకింగ్‌ క్లర్కులు, ఇద్దరు సబ్‌ కాంట్రాక్టర్లు, ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. జయ్‌సుఖ్‌ పటేల్‌ పదో నిందితుడిగా ఉన్నారు. పటేల్‌ లొంగిపోయే సమయంలో కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయన లొంగిపోయే సమయంలో తమ వారిని కోల్పోయిన వారంతా కోర్టు ప్రాంగణంలోనే ఉన్నారు. దీంతో వారంతా జయ్‌సుఖ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు, ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. వంతెన కాంట్రాక్టును దక్కించుకున్న ఒరెవా కంపెనీ తుప్పుపట్టిన కేబుళ్లను గానీ, యాంకర్‌ పిన్స్‌ గానీ, బోల్టులు గానీ మార్చలేదని తన నివేదికలో సిట్‌ పేర్కొంది. వంతెన సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఎలాంటి నిపుణుడినీ ఈ గ్రూప్‌ సంప్రదించలేదని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని