Modi: మోదీ జమ్మూ పర్యటనపై నోరు పారేసుకున్న పాక్‌ ప్రధాని.. ఖండించిన భారత్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకశ్మీర్‌ పర్యటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాకిస్థాన్‌ నూతన ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌.. భారత్‌పై నోరుపారేసుకున్నారు.

Published : 29 Apr 2022 14:10 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జమ్మూకశ్మీర్‌ పర్యటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన పాకిస్థాన్‌ నూతన ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌.. భారత్‌పై నోరుపారేసుకున్నారు. ఆ పర్యటన అంతా ఓ ‘డ్రామా’ అంటూ ఆరోపించారు. కాగా.. పాక్‌ ప్రధాని వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన వ్యవహారాలపై పాక్‌కు మాట్లాడే హక్కు లేదంటూ గట్టిగా సమాధానమిచ్చింది.

‘‘ప్రధాని పర్యటనను డ్రామా అనడంలో పాక్‌ ఉద్దేశం ఏంటీ?. అక్కడ పర్యటనే జరగలేదని, భారత్‌ కావాలని షో చేస్తోందని పాక్‌ ఆరోపిస్తోంది. జమ్మూలో ప్రధానికి లభించిన ఘన స్వాగతం.. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఫొటోలు.. ప్రధాని పర్యటనపై రేకెత్తే అనుమానాలకు సమాధానాలు. జమ్మూకశ్మీర్‌లో జరిగే వ్యవహారాలపై స్పందించేందుకు పాకిస్థాన్‌కు ఎలాంటి హక్కు, స్థాయి లేదు’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చీ దాయాదికి కౌంటర్‌ ఇచ్చారు.

గత ఆదివారం ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా చీనాబ్‌ నదిపై రెండు జల విద్యుత్‌ ప్రాజెక్టులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన అనంతరం మోదీ జమ్మూకశ్మీర్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. అయితే ఈ పర్యటనపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ పరిస్థితులు సజావుగా ఉన్నట్లు నమ్మించడానికి వేసిన మరో ఎత్తుగడగా పాక్‌ విదేశాంగ శాఖ అభివర్ణించింది. అంతేగాక, చీనాబ్‌ నదిపై చేపట్టిన ప్రాజెక్టులపై పాక్‌కు అభ్యంతరాలున్నాయని, వాటికి సంబంధించిన సమాచారాన్ని భారత్‌ తమతో పంచుకోలేదని పేర్కొంది. అక్కడ శంకుస్థాపనలు చేయడం ద్వారా భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని